పీవీ, చౌదరి చరణ్ సింగ్ సహా ఐదుగురికి భారత రత్న అవార్డులు: ప్రదానం చేసిన రాష్ట్రపతి
ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు సహా మరో ముగ్గురికి భారతరత్న అవార్డులను ఇటీవల కేంద్రం ప్రకటించింది.ఇవాళ రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి భారత అవార్డులను అందించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం నాడు ఐదుగురికి భారతరత్న అవార్డులను ప్రధానం చేశారు.రాష్ట్రపతి భవన్ లో శనివారం నాడు భారతరత్న అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారత రత్నను ప్రకటించింది. ఇవాళ పీవీ నరసింహారావు తరపున ఆయన కొడుకు ప్రభాకర్ రావు భారతరత్న అవార్డును అందుకున్నారు.
భారత మాజీ ప్రధాన మంత్రి చౌదరి చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు భారత రత్న అవార్డును అందుకున్నారు.బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులు భారత రత్నను అందుకున్నారు.దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్ కుటుంబ సభ్యులు భారత రత్న అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ , కర్పూరీ ఠాకూర్, ఎం.ఎస్. స్వామినాథన్ లకు మరణానంతరం భారతరత్న అవార్డులు ప్రదానం చేశారు. మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి ఎల్. కే. అద్వానీకి కూడ భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపు ఉదయం ఎల్. కే. అద్వానీ నివాసానికి వెళ్లి ఈ అవార్డును అందించనున్నారు.
చౌదరి చరణ్ సింగ్ మనమడు జయంత్ సింగ్, పీవీ నరసింహరావు కొడుకు ప్రభాకర్ రావు, కర్పూర్ ఠాకూర్ కొడుకు రామ్ నాథ్ ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్ కూతురు నిత్యారావు ఈ అవార్డులను అందుకున్నారు.భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు.