సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటకే అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు.. మరోవైపు రామ మందిరంలో అందరనీ భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా విరాళ సేకరణను పూనుకున్నారు.

 వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ లాంటి సంస్థలు ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నాయి.. దీని కోసం ప్రత్యేక కూపన్లను కూడా సిద్ధం చేశారు. ఇక, ఇవాళ శ్రీ రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణ ప్రారంభమైంది... తొలి విరాళాన్ని దేశ ప్రథమ పౌరుడు అందించారు. 

తొలి విరాళంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూ. 5,01,000 మొత్తానికి విరాళంగా ఇచ్చారు. ఆయన దేశానికే మొదటి పౌరుడు, కాబట్టి మేం ఈ డ్రైవ్‌ను ప్రారంభించడానికి ఆయన వద్దకు వెళ్లాం.. రాష్ట్రపతి రూ .5,01,000 మొత్తాన్ని విరాళంగా ఇచ్చారని సంబంధిత చెక్కును చూపించారు విహెచ్‌పీ నేత అలోక్ కుమార్. 

రామ్‌ మందిర్‌ నిర్మాణ్‌ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, విహెచ్‌పి ఎగ్జిక్యూటివ్ అలోక్ కుమార్, రామ్ మందిర్ నిర్మణ్‌ సమితి చీఫ్ బృపేంద్ర మిశ్రా తదితర నేతలు ఇవాళ రాష్ట్రపతిని కలిశారు. 

ఇక, ఈ విరాళాల సేకరణ రెండు దశల్లో 44 రోజులు కొనసాగనుంది. మొదటి దశ జనవరి 15 నుండి 31 వరకు కొనసాగనుండగా, ఇందులో దేవాలయ నిర్మాణానికి వీహెచ్‌పీ దేశంలోని ప్రముఖుల నుండి విరాళాలు కోరనుంది. రెండవ దశ ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 27తో ముగుస్తుంది, 

దేశంలోని సాధారణ ప్రజల నుండి విరాళాలు సేకరించనున్నారు. రామ మందిర నిర్మాణాన్ని పూర్తిగా సాధారణ ప్రజల సహకారంతో పూర్తి చేస్తామంటున్నారు. రామ్ జన్మభూమి రీజియన్ ట్రస్ట్ కూడా సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) నిధిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించకూడదని నిర్ణయించింది. సామాన్య ప్రజల నుంచి విరాళాలు సేకరించడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా కూపన్లు ముద్రించారు.