President Election 2022: మతాల పేరిట విభ‌జ‌న‌కు కార‌ణ‌మవుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఉండాలని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా హితవు పలికారు. రబ్బర్​ స్టాంపుగా మారబోనని  ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ప్రతిజ్ఞ చేయాలని సవాల్​ విసిరారు.

President Election 2022: రాష్ట్ర‌ప‌తి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించినప్పటి నుంచి ఆయ‌న దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు యశ్వంత్ సిన్హా సవాల్ విసిరారు. మతాల పేరిట విద్వేషాలు సృష్టిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలని సూచించారు. అదే స‌మ‌యంలో ప్రభుత్వానికి రాష్ట్ర‌ప‌తి రబ్బర్​ స్టాంపుగా మారకూడ‌ద‌ని, ఈ మేర‌కు ద్రౌపదీ ముర్ము ప్రతిజ్ఞ చేయాలన్నారు.

సాధారణంగా రాష్ట్రపతి అంటే మౌనంగా ఉంటారనీ, రాష్ట్ర‌ప‌తికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడే అవకాశం ఉండ‌ద‌ని అన్నారు. ఒక‌వేళ తాను రాష్ట్ర‌ప‌తి అయితే.. అలా మాత్రం ఉండ‌న‌నీ, ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నిస్తాన‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఎన్డీయే ప్రత్యర్థి ద్రౌపది ముర్ముకీ సవాళ్లు విసిరారు. ప్రభుత్వానికి రబ్బరు స్టాంపుగా మారకుండా.. రాజ్యాంగ సంరక్షకుడిగా ఉంటూ.. ప్రజలకు సేవ చేస్తానని యశ్వంత్​ సిన్హా ప్రతిజ్ఞ చేశారు. 

తాను రాష్ట్ర‌ప‌తిని అయితే.. ప్ర‌జల భావప్రకటనా, స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని కాపాడుతానని తేల్చి చెప్పారు. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం.. దేశంలో విషపూరిత మత విద్వేషాలను రెచ్చగొడుతోందని.. మతాల పేరిట విభజన సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ క్ర‌మంలో ద్రౌప‌దీ ముర్ముకు స‌వాలు విసిరారు. తాను ప్ర‌భుత్వానికి రబ్బరు స్టాంపును కాననీ, ప్రతిజ్ఞ చేయాలని కోరారు.

విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా చేసిన రబ్బర్‌ స్టాంప్‌ రాష్ట్రపతి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పందించారు. ఆదివాసీ మహిళ రాష్ట్ర‌ప‌తి పదవికి తగినది కాదనే భావన ఉండటం.. ఆయన దుష్ట మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. దేశానికి రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి అవసరం లేదనీ, కానీ అదే విధంగా, తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న స్వయం నిర్మిత ఆదివాసీ మహిళపై తప్పుడు ప్రచారానికి పాల్పడే మనస్తత్వం ప్రమాదకరమ‌ని అన్నారు. తనకు తాను మాత్రమే అర్హుడని భావించే మానసిక స్థితి ప్రమాదకరమ‌ని అన్నాడు.

ముర్ము అనే ఆదివాసీ మహిళ.. జార్ఖండ్ గవర్నర్‌గా, ఒడిశాలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, కాలేజీలో లెక్చరర్‌గా ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకుంద‌నీ, ఆదివాసీ స్త్రీ ఆ పదవిని పొందగలిగేది కాదు అనే భావన ఒకరి దుష్ట మనస్తత్వాన్ని వర్ణిస్తుందని విమర్శించారు. ప్రస్తుత సంఖ్య ఆధారంగా జూలై 18న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం ఖాయమని రవి తెలిపారు.

రాజకీయ ప్రత్యర్థులను భ‌య‌పెట్టాడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ప్ర‌తిప‌క్షాల అభ్య‌ర్థి సిన్హా ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై రవి స్పందిస్తూ.. నిజాయితీ ఉన్నవారిని ఈడీ లేదా ఆదాయపు పన్ను శాఖలు ఏమీ చేయలేవని, అవినీతిపరులు వారి నుంచి తప్పించుకోలేరని అన్నారు. అవినీతికి పాల్పడిన వారు మాత్ర‌మే ఆందోళన చెందాలని అన్నారు. నిజాయితీపరులకు ఆందోళ‌న చెందాల్సిన‌ అవసరం లేదనీ అన్నారు.

జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్​ను పార్లమెంట్​లోని 63 నెంబరు గదిలో జ‌రుగ‌నున్న‌ది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్​ సాగుతుంది. 21న కౌంటింగ్​ జ‌రుగుతుంది. జులై 24 తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం పూర్తి కావ‌డంతో జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.