భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు లండన్‌లో పర్యటించి బ్రిటన్ రాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరుఫున ఆమె సంతాపాన్ని తెలియజేయనున్నారు.
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II అంత్యక్రియలకు బారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె రాజ కుటుంబానికి సంతాపం తెలియజేయనున్నారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 17 నుండి 19 మధ్యలో లండన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటన వెల్లడించింది.
యునైటెడ్ కింగ్‌డమ్ మాజీ రాష్ట్ర అధిపతి మరియు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అధిపతి క్వీన్ ఎలిజబెత్ II తన 96 సంవత్సరాల వయస్సులో స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్ వేసవి నివాసంలో సెప్టెంబర్ 8న మరణించారు. సెప్టెంబర్ 19న ఆమె అంత్యక్రియలు వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరుగుతాయి.
క్వీన్ ఎలిజబెత్ మృతి పట్ల అధ్యక్షుడు ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. భారత సంతాపాన్ని తెలియజేసేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్‌ను సందర్శించారు. భారతదేశం కూడా సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినాన్ని పాటించింది.
క్వీన్ ఎలిజబెత్ II 70 ఏళ్ల పాలనలో భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలు మరింతగా పెరిగాయని, మరింత దృఢంగా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కామన్వెల్త్ అధినేతగా, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజల సంక్షేమంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంది.
ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ నేతలు
క్వీన్స్ అంత్యక్రియలకు ప్రపంచవ్యాప్తంగా 2000 మంది అతిథులు హాజరుకానున్నారు, ఇందులో దాదాపు 500 మంది ప్రముఖులు ఉన్నారు. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 19న తెల్లవారుజామున 3.30 గంటలకు రాణి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బ్రిటన్‌తో దౌత్య సంబంధాలు ఉన్న దేశాల నేతలను అంత్యక్రియలకు ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తన భార్య జిల్ బిడెన్‌తో కలిసి క్వీన్స్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు లండన్‌కు వెళ్లనున్నారు.
వీరితో పాటు, కామన్వెల్త్ దేశాల అధినేతలు హాజరుకానున్నారు. న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్ 24 గంటల ప్రయాణం తర్వాత లండన్ చేరుకోనున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా సెప్టెంబర్ 19న లండన్ చేరుకోనున్నారు.
అలాగే.. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా రాణి అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఇతర అంతర్జాతీయ నాయకులలో ఐరిష్ టావోసీచ్ మైఖేల్ మార్టిన్, జర్మన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్, ఇటాలియన్ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ చక్రవర్తి నరుహిటో, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ సుక్-యోల్ లు అంత్యక్రియలకు హాజరు కానున్నారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్రమోడీ వెళ్తారా? లేదా ? అన్నది ఇంకా నిర్ధారణ కానప్పటికీ భారత రాష్ట్రపతి పర్యటన ఖరారు అయ్యింది.
