Independence Day: 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా దేశాన్ని ఉద్దేశించి ఆమె చేసే తొలి ప్రసంగం ఇదే. 

Independence Day: 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతిగా దేశాన్ని ఉద్దేశించి ఆమె చేసే తొలి ప్రసంగం ఇదే. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి ప్రసంగం ఆల్ ఇండియా రేడియోలోని అన్ని జాతీయ నెట్‌వర్క్‌లు, అన్ని దూరదర్శన్ ఛానెల్‌లలో రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుందని ప్రకటన తెలిపింది. ఇది మొదట హిందీలో ఆ తరువాత ఆంగ్లంలో ప్రసారం చేయబడుతుంది. ఆల్ ఇండియా రేడియో తమ ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషలో దీన్ని ప్రసారం చేస్తుంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట 'హర్ ఘర్ త్రివర్ణ పతాకం' ప్రచారం ప్రారంభమైంది. ఆగస్టు 13 నుంచి 15 వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 25న దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించిన అతి పిన్న వయస్కురాలు, తొలి గిరిజనురాలు. అలాగే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి కూడా ఈమెనే. 

ద్రౌపది ముర్ము తన వృత్తి జీవితాన్ని ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి, క్రమంగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగులు వేసింది. 1997లో రాయరంగపూర్ నగర్ పంచాయతీ కౌన్సిలర్ ఎన్నికల్లో గెలుపొంది తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. సాధారణ గిరిజన కుటుంబం నుండి వచ్చిన 64 ఏళ్ల ముర్ము తొలుత‌ కౌన్సిలర్ నుండి మంత్రిగా.. అనంత‌రం జార్ఖండ్ గవర్నర్ పదవి చేప‌ట్టారు. ఫైన‌ల్ గా భారత రాష్ట్రపతిగా పదవి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.