రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫైటర్ జెట్ లో ప్రయాణించారు. అంతకు ముందు 2009లో, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు తొలిసారిగా యుద్ధ విమానాన్ని ఎక్కారు. వ్యూహాత్మక వైమానిక స్థావరం అయిన అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సుఖోయ్ 30 MKI ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు ఆమె యాంటీ గ్రావిటీ సూట్ ధరించి కనిపించారు. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి మూడు సర్వీసులకు సుప్రీం కమాండర్. మొదటి ఆమె భద్రతా దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు.
ఆ తరువాత సుఖోయ్ 30లో కాసేపు విహరించారు. దీనికోసం ఫ్లయింగ్ సూట్ వేసుకున్నారు. రాష్ట్రపతి ఎక్కిన విమానాన్ని గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ తివారీ నడిపారు. 2009లో మాజీ రాష్ట్రపతి, భారత దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్రయాణించారు. సుఖోయ్-30 MKI అనేది రష్యాకు చెందిన సుఖోయ్ అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ మల్టీరోల్ ఫైటర్ జెట్, భారతదేశపు ఏరోస్పేస్ దిగ్గజం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లైసెన్స్‌తో నిర్మించబడింది.
మూడు రోజుల పర్యటన కోసం ద్రౌపది ముర్ము గత గురువారం అస్సాం చేరుకున్నారు. శుక్రవారం కజిరంగ జాతీయ పార్కులో జరిగిన గజ్ ఉత్సవ్ ను, మౌంట్ కాంచనగంగ సాహసయాత్ర.. 2023ను ప్రారంభించారు.
