ఈషా షౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనబోతున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆమె తొలిసారిగా తమిళనాడు పర్యటన చేయబోతున్నారు. 

ఢిల్లీ : భారతదేశపు మొట్టమొదటి గిరిజన మహిళా అధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 18న కోయంబత్తూర్‌లోని ఈశా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలకు విచ్చేయనున్నారు. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించిన తర్వాత ఆమె తమిళనాడుకు రావడం ఇదే తొలిసారి. ఈశాలో జరిగే మెగా వేడుకల్లో రాష్ట్రపతి స్వయంగా పాల్గొంటున్నందున.. ముందు జాగ్రత్తగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.

మహాశివరాత్రి నాడు రాత్రంతా ఈ వేడుక సాగుతుంది. ఈ వేడుకలు ఫిబ్రవరి 18.. సాయంత్రం 6 గంటలకు మొదలై తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈశా మహాశివరాత్రి ఉత్సవం 21 భాషలలో ఆన్లైన్లో ప్రత్యక్ష ప్రసారం అవ్వబోతోంది. అలాగే భారతదేశంలోని అన్ని ప్రముఖ టీవీ నెట్వర్క్‌లలో ఇంగ్లీషు, తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మరాఠీ, తదితర ప్రాంతీయ భాషలలో ప్రసారం చేయబోతున్నారు.

మహాశివరాత్రి రోజున కొన్ని వేల మంది ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే, కొన్ని లక్షలమంది గైడెడ్ ధ్యానాలలో పాల్గొంటారు. అలాగే 112 అడుగుల ఆదియోగి ఎదురుగా జరిగే సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలను ఆస్వాదించనున్నారు. మహాశివరాత్రి ప్రాముఖ్యతను వివరిస్తూ, సద్గురు, “మహాశివరాత్రి ఓ మతానికో, లేదా ఓ విశ్వాసానికో, లేదా ఓ జాతికో, లేదా ఓ దేశానికో చెందినది కాదు.. ఈ రాత్రిన ఉండే గ్రహ స్థితులు, మనిషిలో శక్తులు సహజంగానే ఉప్పొంగెలా చేస్తాయి. ఇది విశ్వ వ్యాప్తంగా ప్రభావం చూపే ఒక ఖగోళ సంఘటన. దీన్ని ఎరుకతో అనుభూతి చెందండి” అని అన్నారు.

ఈశా మహాశివరాత్రి వేడుకలు ధ్యానలింగం వద్ద పంచభూత ఆరాధనతో మొదలవుతాయి, ఆపై లింగ భైరవి మహాయాత్ర, సద్గురు అందించే అనుగ్రహ భాషణలు, ఆపై నడిరేయి ధ్యానాలు ఇంకా కనులవిందైన ఆదియోగి దివ్య దర్శనం అనే ఓ త్రీడీ ప్రొజెక్షన్ ఇమేజింగ్ షో ఉంటాయి. 

ఈ సంవత్సరం, రాజస్థానీ జానపద గాయకుడు మామే ఖాన్, అవార్డు గెలుచుకున్న సితార్ మాస్ట్రో నీలాద్రి కుమార్, టాలీవుడ్ గాయకుడు రామ్ మిరియాల, ఇంకా తమిళ నేపథ్య గాయకులు వేల్మురుగన్, మంగ్లీ, కుత్లె ఖాన్ ఇంకా జానపద గాయని అనన్య చక్రవర్తి వంటి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రఖ్యాత కళాకారులు ప్రదర్శనలివ్వనున్నారు. కర్ణాటక జనపద ఇంకా తెయ్యం బృందాలు కూడా తమ నృత్యం ఇంకా సంగీతం ద్వారా తమ జానపద సంస్కృతిని ప్రదర్శిస్తాయి. 

ఎంతగానో ఎదురుచూసే ఈశా ఫౌండేషన్ సొంత బ్రాండ్- సౌండ్స్ ఆఫ్ ఈశా వారి ప్రదర్శనలు, అలాగే ఈశా సంస్కృతి నృత్య ప్రదర్శనలు ఈ రాత్రి ఆధ్యాత్మిక సౌరభాన్ని మరింతగా పెంచుతాయని తెలిపారు. దీని గురించి మరిన్ని వివరాలకు +91 94874 75346 నెంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చు. లేదా mediarelations@ishafoundation.org కు మెయిల్ చేయచ్చు.