శుక్రవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఈ దేశానికి రాజ్యాంగబద్ధమై అధిపతి అనీ, రాజకీయాలకు అతీతమైన ఆయన ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించడం దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు.

రాష్ట్రపతి ప్రసంగాన్ని దాదాపు 20 పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బహిష్కరించడంపై ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసలు సమస్య ‘అహంకారమే’నన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండా తమదే అధికారం అన్నట్లు ఆ పార్టీ భావిస్తోందని ఆయన మండిపడ్డారు. 

ప్రతిపక్షాలు పార్లమెంటరీ మర్యాదలను ఉల్లంఘించాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగినప్పటికీ బీజేపీ ఎన్నడూ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించలేదని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 

ఈ నెల 26న జరిగిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసను కాంగ్రెస్ పార్టీ ఖండించలేదని.. ఎర్రకోటపై జాతీయ జెండాకు అవమానం జరిగినా కనీసం ఆ పార్టీ స్పందించలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ నినాదాలు చేయడం తీవ్రంగా బాధించిదన్నారు. 

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్ధతుగా ప్రతిపక్షాలు ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే.