Asianet News TeluguAsianet News Telugu

గర్భిణీకి కావాల్సింది జైలు కాదు..బెయిల్.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌరవప్రదమైన మాతృత్వం ప్రతి స్త్రీ హక్కు... గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు... బెయిల్ అని స్పష్టం చేసింది. 

Pregnant women need bail, not jail, says Himachal HC - bsb
Author
Hyderabad, First Published Jul 27, 2021, 12:39 PM IST

హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గౌరవప్రదమైన మాతృత్వం ప్రతి స్త్రీ హక్కు... గర్భిణీ స్త్రీలకు కావాల్సింది జైలు కాదు... బెయిల్ అని స్పష్టం చేసింది. నార్మాటిక్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ (ఎన్ డిపిఎస్ యాక్ట్ ) కింద నమోదైన కేసులో సహ నిందితురాలిగా ఉన్న గర్భిణీ స్త్రీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఈ సందర్భంగా జస్టిస్ అనూప్ చిట్కర మాట్లాడుతూ.. నిందితురాలికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసి.. శిక్షను ప్రస్తుతం నిలిపివేసి.. డెలివరీ తర్వాత ఒక సంవత్సరం వరకు పొడిగింవచ్చని తెలిపారు. అంతేకాక నేరాలు చాలా ఘోరంగా ఉన్నప్పుడు, ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా దీన్ని అనుమతించాలన్నారు. 

‘జైలు శిక్షను వాయిదా వేయడం ద్వారా రాష్ట్రానికి, సమాజానికి ఏదైనా హాని జరుగుతుందా.. జైలు శిక్ష వాయిదా వేస్తే ఆకాశం  ఊడి పడదు. సమాజంలోని ప్రతి స్త్రీ గౌరవప్రదమైన మాతృత్వానికి అర్హురాలు. గర్బం దాల్చిన నాటి నుంచి డెలివరీ తరువాత ఏడాది వరకు ఆమె మీద ఎలాంటి పరిమితులు ఉండకూడదు’ అన్నారు చిట్కరా. 

‘జైలులో ప్రసవిస్తే.. ఆ బిడ్డ సామాజిక ద్వేషాన్ని చవి చూస్తుంది. పుట్టుక గురించి ప్రశ్నించి.. జైలులోనే జన్మించాడని తెలిస్తే.. సమాజం ఆ బిడ్డను ఎంత చీదరించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవన్ని ఆ బిడ్డ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇక జైలులో మంచి ఆహారం అందించడం ద్వారా శారీరక ఆరోగ్యం బాగానే ఉండవచ్చు. కానీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది’ అన్నారు.

ఎన్ డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 37 లోని ఆదేశం నిందితులు నిర్దోషులకు క్లీన్ చీట్ ఇవ్వడానికి.. రెండు షరతులను సంతృప్తి పరచాలని సూచిస్తుంది. దర్యాప్తుదారులు సేకరించిన సాక్ష్యాలు నిందితులకు బెయిల్ నిరాకరించడానికి చట్టబద్ధంగా సరిపోకపోవడమే కాక, వారి మీద మరే ఇతర దోషపూరిత సాక్ష్యాలు, ఆరోపణలు లేనప్పుడు.. నిందితులను నిర్దోషులుగా భావించవచ్చు. దీని ప్రకారం, పిటిషనర్ మొదటి షరతును సంతృప్తి పరిచారు. కనుక ఆమెను తక్కువ వ్యవధి బెయిల్ మంజూరు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దీని ఆధారంగా కోర్టు నిందితురాలికి బెయిల్ మంజూరు చేస్తుంది’ అని తెలిపారు. 

అసలు కేసేంటంటే.. గర్భిణీ స్త్రీని, మాదక ద్రవ్యాల వ్యాపారంలో తన భర్తతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాక వారి ఇంట్లో సోదాలు నిర్వహించి 259 గ్రాముల హెరాయిన్, 713 గ్రాముల ట్రామడోల్ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితురాలు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. 

దీనికంటే ముందు బాధితురాలు కంగ్రా జిల్లా ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు ఈ ఏడాది జనవరి, 19న దాన్ని కొట్టేసింది. దాంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios