కట్నం కోసం ఓ అత్తమామ దారుణానికి ఒడిగట్టారు. కోడలు కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా ఆమెకు శిక్ష వేశారు. పుట్టింటికి వెళ్లి కట్నం తేవాలని ఆదేశిస్తూ ఆమెను చితకబాది... బలవంతంగా ఆమెకు గుండు కొట్టించారు. అనంతరం ఆమెను గ్రామ పొలిమేరల్లో వదిలపెట్టారు. ఈ సంఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఉత్తరప్రదేశ్ లోని హథారస్ కు చెందిన యువతికి అలీగఢ్ కి చెందిన యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.  పెళ్లి జరిగిన నాటి నుంచి అదనపు కట్నం కోసం.. యువతిని అత్తింటి వారు వేధించడం మొదలుపెట్టారు. తాజాగా కడుపుతో ఉందన్న కనికరం కూడా లేకుండా గొడ్డును బాదినట్లు బాదారు.

అనంతరం ఆమెకు బలవతంగా గుండు కొట్టించి.. ఊరి పొలిమేరల్లో వదిలేశారు. కాగా ఆమె అష్టకష్టాలు పడి పుట్టింటికి చేరింది. అయితే.. తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ.. బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కుమార్తె అత్తింటి వారిపై పోలీసు కేసు పెట్టారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.