ఓ గర్భిణీకి తొమ్మిది నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. అయితే వారు ఉండే కొండలపై ఉన్న అంబులెన్స్ రాలేదు. దీంతో ఆ గర్బిణీ  ఏడు కిలోమీటర్లు నడిచింది.  ఈ ఘటన జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. 

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. సకాలంలో వైద్యం అందక నేటీ ఎంతో మంది మరణిస్తున్నారంటే..ఇది దేశానికి సిగ్గుచేటు. ఆందోళన కలిగించే విషయం కూడా. దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో వైద్య పరిస్థితి మరి దారుణం. వారి కష్టాలు వర్ణానీతం. తాజాగా ఓ నిండు గర్భిణీ .. వైద్యం కోసం పురిటి నొప్పులతో అల్లాడిపోతూ.. దాదాపు 7 కిలో మీటర్లు నడిచింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా ఇచక్ బ్లాక్‌లోని దాదీ ఘఘర్ పంచాయతీ పరిధిలోని పురాన్‌పానియా గ్రామంలో గురువారం రాత్రి మున్నీ దేవి అనే గర్భిణీ తొమ్మిది నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. ఆ మహిళ ప్రసవ వేదనతో అల్లాడుతోంది. సమయం గడిచిన కొద్దీ ఆ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆమెను కచ్చితంగా ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ.. వారు ఉండే గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో వారి పల్లెకు అంబులెన్స్ రాలేవు.

సరైన రోడ్డు మార్గం కోసం దాదాపు వారి పల్లె నుంచి 7 కిలో మీటర్లు నడవాల్సిందే. ఇక చేసేదేమీ లేక మున్నీ దేవి భర్త సురేంద్ర కిష్కు, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను తీసుకుని కచ్చా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లడం ప్రారంభించారు. ప్రసవ వేదనతో అల్లాడుతూ.. ఆ మహిళ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది. ఈ సంగతి తెలిసిన స్థానికులు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మంచం సాయంతో కొంత దూరం తీసుకెళ్లారు. అప్పటికే గ్రామానికి 7 కిలో మీటర్ల దూరంలో వేచి ఉన్న అంబులెన్స్ వద్దకు చేర్చారు. అంబులెన్స్ వాహనం సహాయంతో ఆమెను ఇచాక్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు.అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే.. ఇలాంటి పరిస్తితులు ఇక్కడ సర్వసాధరణం. 

రోడ్డు లేకపోవడంతో పురాన్‌పునియా గ్రామంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడిన వ కాలినడకన గానీ, డోలీ కట్టి గానీ, మంచంపై ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకువెళ్తారంట. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా పురాన్‌పునియా గ్రామానికి రోడ్డు, కరెంటు, తాగునీరు వంటి సౌకర్యాలు లేవు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుంటున్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తారు.

తీరా ఎన్నికల్లో గెలిచినా తరువాత నాయకులు మొఖం చాటేస్తారని, ఇప్పటి వరకు పురాన్‌పునియా గ్రామ ప్రాథమిక సమస్య పరిష్కారానికి ఏ ప్రభుత్వంగానీ, ప్రజాప్రతినిధిగానీ చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కోని తమ పల్లెకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తాము ఎంత ఆందోళన చేసినా పట్టించుకునే వారే లేరని స్థానికులు వాపోతున్నారు.