కాలం ఎంత మారుతున్నా సమాజంలో మగసంతానంపై మక్కువ మాత్రం చాలడం లేదు. ఆడపిల్లలు మగవారికన్నా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నప్పటికీ మగబిడ్డే కావాలంటూ పట్టుదల ప్రదర్శించేవారు దేశంలో కోకొల్లలు.

తాజాగా మగబిడ్డ కోసం కుటుంబసభ్యులు పెట్టిన ఒత్తిడితో ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్‌గావ్‌కు చెందిన మీరా ఎఖాండే అనే మహిళ ఇప్పటికే ఏడుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

మగబిడ్డ కావాలని భర్తతో పాటు కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో  అందుకోసం ప్రయత్నించగా రెండు సార్లు గర్భస్రావం సైతం అయ్యింది. అయినప్పటికీ మరోసారి బిడ్డ కోసం ప్రయత్నించడంతో ఆమె 10వ సారి గర్భం దాల్చింది.

ఆ కుటుంబం కోరుకుంటున్నట్లు మగబిడ్డ పుట్టినప్పటికీ కాన్పు సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఆమె మృతశిశువుకు జన్మనిచ్చి మరణించింది. మగబిడ్డ కావాలని కుటుంబసభ్యులు పట్టుబట్టడం వల్లే దారుణం జరిగిందని నిర్థారణకు వచ్చిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.