Asianet News TeluguAsianet News Telugu

లోన్ రికవరీ ఏజెంట్ అమానవీయ చర్య.. ట్రాక్టర్ చక్రాల కింద నలిగి చనిపోయిన గర్భిణి

జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 27 ఏళ్ల గర్భిణిపై నుంచి లోన్ రికవరీ ఏజెంట్ ట్రాక్టర్‌‌ను పోనివ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 

Pregnant Woman Crushed Under Tractor By Loan Recovery Agent in jharkhand
Author
First Published Sep 18, 2022, 9:48 AM IST

జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 27 ఏళ్ల గర్భిణిపై నుంచి లోన్ రికవరీ ఏజెంట్ ట్రాక్టర్‌‌ను పోనివ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి తీసుకున్న రుణానికి సంబంధించిన బకాయి చెల్లించలేదని రికవరీ ఏజెంట్ ట్రాక్టర్‌ను రికవరీ చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్ సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ రతన్ చోటే తెలిపారు. నిందితులను అరెస్టు చేసేందుకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (హెచ్‌క్యూ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇచాక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బరియానాథ్‌కు చెందిన మిథిలేశ్‌ మెహతా అనే దివ్యాంగ రైతు మహీంద్రా ఫైనాన్స్‌ కంపెనీ రుణంతో ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. అయితే తీసుకున్న రుణానికి సంబంధించి బకాయి ఉన్న రూ. 1.3 లక్షలు వెంటనే చెల్లించాలని అతడికి కంపెనీ నుంచి గరువారం ఫోన్ వచ్చింది. డబ్బులు చెల్లించకుంటే ఎన్‌హెచ్‌-33లో సమీపంలోని పెట్రోల్‌ పంపు వద్ద ఆపి ఉంచిన ట్రాక్టర్‌ను తీసుకెళ్లిపోతామని కంపెనీ ప్రతినిధులు బెదిరించారు. దీంతో వెంటనే మోహతా తన ట్రాక్టర్‌‌‌ను లోన్ రికవరీ ఏజెంట్లు తీసుకుని వెళ్లకుండా ఉండేందుకు.. ట్రాక్టర్ ఉన్నచోటుకు చేరుకున్నాడు. అయితే అప్పటికే రికవరీ ఏజెంట్‌ ట్రాక్టర్‌ను నడుపుతున్నాడు. 

దీంతో కదులుతున్న ట్రాక్టర్‌ను వెంబడించిన మోహతా.. రికవరీ ఏజెంట్‌కు వెంటనే రూ. 1.2 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే రికవరీ ఏజెంట్ మత్రం ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకోకుండా ఉండాలంటే.. మొత్తం బకాయి చెల్లించాలని పట్టుబట్టాడు. మోహతా విజ్ఞప్తిని పట్టించుకోకుండా ట్రాక్టర్ నడుపుతూనే ఉన్నాడు. అదే సమయంలలో ఘటన స్థలానికి చేరుకున్న గర్బిణి అయిన మోహతా కూతురు.. ట్రాక్టర్‌ను తీసుకువెళ్లకుండా చూసేందుకు దాని వెంబడి పరుగెత్తింది. ఈ క్రమంలో ఆమె నుంచి ట్రాక్టర్ చక్రాలు వెళ్లడంతో మృతిచెందింది.  

ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గర్భిణి మృతదేహంతో హజారీబాగ్ కలెక్టరేట్ ముందు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ధర్నా చేశారు. ఫైనాన్స్ కంపెనీ మేనేజర్, రికవరీ ఏజెంట్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక, నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో రెండు గంటల తర్వాత గ్రామస్తులు ఆందోళన విరమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios