Prayagraj Mahakumbh 2025 : ప్రయాగ్ రాజ్ మహాకుంభ్‌ 2025 లో లక్షన్నర మొక్కలతో అలంకరించిన హైడెన్సిటీ ఆక్సిజన్ ఫారెస్ట్ భక్తులకు స్వాగతం పలకనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదేశాల మేరకు ప్రధాన కూడళ్ళు, రహదారులను కూడా మొక్కలతో అలంకరిస్తున్నారు. 

Prayagraj Mahakumbh 2025 oxygen forest: ఈసారి మహాకుంభ్‌కు దేశవిదేశాల నుండి వచ్చే భక్తులకు ప్రత్యేకమైన హైడెన్సిటీ ఆక్సిజన్ ఫారెస్ట్ ఆనందాన్ని పంచనుంది. లక్షన్నర మొక్కలతో మహాకుంభ్ నగర్‌ను అందంగా అలంకరిస్తున్నారు. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులకు తగినంత ప్రాణవాయువు లభించడమే కాకుండా, ప్రకృతి అందాలను చూసి ఈ మహాకుంభ్ వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటోంది సీఎం యోగి సర్కారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మహాకుంభ్ నగర్‌లోని ప్రధాన కూడళ్ళతో పాటు ఇక్కడికి వచ్చే ప్రధాన రహదారులను కూడా సహజసిద్ధంగా మొక్కలతో అలంకరిస్తున్నారు.

డిసెంబర్ 10 నాటికి మొక్కలు నాటే పని 100% పూర్తి

డిఎఫ్ఓ ప్రయాగరాజ్ అరవింద్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షల మేరకు ఈసారి మహాకుంభ్‌ను దివ్య, నవ్య, భవ్యంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మొత్తం 1,49,620 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 1,37,964 మొక్కలు నాటారు. డిసెంబర్ 10 నాటికి మహాకుంభ్‌లో మొక్కలు నాటే పని 100 శాతం పూర్తవుతుంది. మహాకుంభ్‌లోకి అడుగుపెట్టగానే 50 వేల అందమైన మొక్కలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. వీటి అందాలను చూసి దేశీవిదేశీ పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. హరిత మహాకుంభ్‌ను సిద్ధం చేయడంలో అటవీశాఖ బృందం శరవేగంగా పనిచేస్తోంది. మహాకుంభ్ నగర్‌లోని ప్రతి వీధి, ప్రతి కూడలిలో అందమైన మొక్కలు నాటుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకకు ముందే మహాకుంభ్ నగర్ పచ్చదనంతో కళకళలాడుతుందని తెలిపారు. 

ప్రవేశ, తిరిగి వేళ్లే మార్గాల్లో కూడా పచ్చదనమే.. 

ప్రయాగరాజ్‌లోని అటవీశాఖ ఐటీ అధిపతి ఆలోక్ కుమార్ పాండే మాట్లాడుతూ, మహాకుంభ్ నగర్ లోపల, నగరానికి అనుసంధానించబడిన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను అందమైన మొక్కలతో అలంకరిస్తున్నారు. ఇక్కడ 50 వేల సిమెంట్ గార్డులు, 10 వేల గుండ్రని ఇనుప ట్రీ గార్డులు, 2500 చదరపు ఇనుప గార్డులతో అలంకరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

సరస్వతి హైటెక్ సిటీలో 20 హెక్టార్లలో ఆక్సిజన్ బ్యాంక్

సరస్వతి హైటెక్ సిటీలో హైడెన్సిటీ ఆక్సిజన్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఆక్సిజన్ బ్యాంక్, నగర్ వన్‌గా పనిచేస్తుంది. సరస్వతి హైటెక్ సిటీలో 20 హెక్టార్లలో 87,120 మొక్కలు నాటుతున్నారు. ఇవి దేశవిదేశాల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయని అధికారులు చెబుతున్నారు. 

18 మార్గాల్లో 190 కి.మీ. పరిధిలో మొక్కలు

యోగి ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాకుంభ్ నగర్‌లో 18 మార్గాల్లో 190 కి.మీ. పరిధిలో దాదాపు 50 వేల మొక్కలు నాటుతున్నారు. మహాకుంభ్ నగర్ పట్టణ ప్రాంతంలో 2500 మొక్కలు నాటారు. 50 వేల మొక్కలను ప్రధానంగా ప్రయాగరాజ్-అయోధ్య, ప్రయాగరాజ్-వారణాసి మార్గాలతో పాటు లక్నో, మీర్జాపూర్, రీవా, బాందాతో సహా 18 మార్గాల్లో నాటుతున్నారు.

గంగానది తీరంలో 10 వేల మొక్కలు

గంగానది తీరంలో 10 వేల మొక్కలు నాటుతున్నారు. ప్రత్యేకంగా ఝూన్సీ, అరైల్, ఫాఫామావ్ తీరంలో, పక్కా ఘాట్‌లో అలంకరణ పనులు జరుగుతున్నాయి. మహాకుంభ్ నగర్ పట్టణ ప్రాంతం, పక్కా ఘాట్ నుండి హైటెక్ సిటీ వరకు కర్చనా రేంజ్‌లో వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. ఇందులో గోల్డ్ మోహర్, కచనార్, అమల్తాస్ మొక్కలు దాదాపు 2500 వరకు నాటారు. గంగానది తీర ప్రాంతం అంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. హరిత మహాకుంభ్‌లో భాగంగా మహాకుంభ్ నగర్‌లో మొక్కలు నాటే కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. గంగానది తీరంలో, ముఖ్యంగా ఎడమ ఒడ్డున 3000 అర్జున మొక్కలు నాటుతున్నారు. ప్రయాగ్, సోరాన్ ప్రాంతాలతో పాటు సంగమం గంగా యమునా దక్షిణ తీరంలో గోల్డ్ మోహర్, కంజి మొక్కలు నాటుతున్నారు. కర్చనా రేంజ్‌లో 2000 మొక్కలు నాటుతున్నారు. గంగానది తీర ప్రాంతం, ఝూన్సీ, కక్రా-లీలాపూర్ రోడ్డు ఫూల్పూర్‌లో అర్జున, కచనార్ మొక్కలు 1700 నాటుతున్నారు. ఫాఫామావ్-సహసో-హనుమాన్‌గంజ్ రోడ్డు, ప్రయాగరాజ్-గోరఖ్‌పూర్ రోడ్డు-ఫూల్పూర్ రోడ్డులో అర్జున, పిప్పళ్ళ మొక్కలు 1800 నాటుతున్నారు.