ప్రయాగరాజ్ కుంభమేళా కోసం గంగానది స్వరూపాన్నే మార్చేస్తున్న యోగి సర్కార్ ... ఎంత ఖర్చుచేస్తున్నారో తెలుసా?
యోగి సర్కార్ ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025కి సిద్ధంగా ఉంది. భక్తుల సౌలభ్యం కోసం సంగమం తీరంలో సర్క్యులేషన్ ఏరియాను విస్తరించడానికి రూ.20 కోట్లు ఖర్చు చేస్తోంది.
వచ్చే ఏడాది 2025 జనవరిలో జరిగే ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు విచ్చేసే భక్తులకోసం యోగి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళకు విచ్చేసే కోట్లాదిమంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు. అయితే ఒకేసారి ఇంత భారీసంఖ్యలో భక్తులు స్నానమాచరించేందుకు యోగి సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంగమ తీరంలో సర్క్యులేషన్ ఏరియాను విస్తరించే పనిలో నిమగ్నమయ్యింది యోగి సర్కార్.
త్రివేణి సంగమ ప్రాంతంలో రివర్ ఛానలైజేషన్, డ్రెడ్జింగ్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ పని కోసం నీటిపారుదల, జల వనరుల శాఖ సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుండి అనుమతి కూడా పొందింది.
నిరంతర కోత కారణంగా సంగమం తీరంలో అందుబాటులో ఉన్న భూమి 2019తో పోలిస్తే 60 శాతం తగ్గిందని ఐఐటి గౌహతి నిపుణులు చెబుతున్నారు. వీరి సలహాల మేరకు మేళా అధికారులు, నీటిపారుదల & జల వనరుల శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది.
ఐఐటి గౌహతి నిపుణుల సలహాలు
2019 నుండి 2024 వరకు గంగా నది తీరం పూర్తిగా మారిపోయింది.... దాదాపు 200 నుండి 500 మీటర్ల వరకు కోతకు గురయ్యింది. ఇలా నిరంతర కోత కారణంగా సంగమం తీరంలో అందుబాటులో ఉన్న భూమి 2019 స్థాయితో పోలిస్తే 60 శాతం తగ్గింది. నీటిపారుదల శాఖ ద్వారా శాస్త్రి వంతెన నుండి సంగమం నోస్ వరకు గంగా నది కుడి ఒడ్డున సర్క్యులేటింగ్ ఏరియాను పెంచడానికి ఐఐటి గౌహతి నిపుణులు అందించిన సలహాల ప్రకారం అనేక పనులు ప్రతిపాదించబడ్డాయి.
వరదలకు ముందు చేపట్టిన ఛానలైజేషన్ పనుల వెడల్పును డ్రెడ్జింగ్ మెషిన్ ద్వారా దాదాపు 150 మీ. నుండి 175 మీ. వరకు పెంచాలి. ఈ ప్రాజెక్టులో డ్రెడ్జింగ్ పనిని మెకానికల్ డివిజన్ చేపడుతుంది. ఈ పని నుండి తీసిన డ్రెడ్జ్ చేసిన మెటీరియల్ ను తీరప్రాంతాన్ని బలోపేతం చేయడానికి, సర్క్యులేటింగ్ ఏరియాను పెంచడానికి ఉపయోగిస్తారు. దీని అంచనా వ్యయం 6.34 కోట్ల రూపాయల కంటే ఎక్కువ.
దీనికి తోడు నది కుడి ఒడ్డున జియో బ్యాగ్ బ్యాంక్ పేవ్మెంట్ పనులు చేపట్టాలి, అలాగే నైలాన్ క్రేట్ లో జియో బ్యాగ్ ద్వారా 1X8 మీ. లో లాచింగ్ ఏప్రాన్ పనులు కూడా చేపట్టాలి. తీరప్రాంతం లేయర్ లో జియో గ్రిడ్ 200, 100 ఎంటీ ప్రతి చదరపు మీటరుకు ఉపయోగించాలి. దీని అంచనా వ్యయం రూ.10.24 కోట్లు. ప్రభుత్వం నీటిపారుదల శాఖకు సమగ్ర ప్రతిపాదనను సిద్ధం చేసి నగర అభివృద్ధి శాఖకు పంపాలని ఆదేశించింది. అలాగే నగర అభివృద్ధి శాఖకు తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.