ప్రయాగరాజ్ మహా కుంభమేళా కోసం రైల్వే శాఖ చేపట్టిన ఏర్పాట్లివే...
ప్రయాగరాజ్ మహా కుంభమేళాకి వచ్చే భక్తుల కోసం ఇండియన్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషిచేస్తోంది.
మహాకుంభ్ నగర్ : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం ప్రయాగరాజ్ మహా కుంభమేళా... దీన్ని విజయవంతం చేయడానికి అటు మోదీ, ఇటు యోగి ప్రభుత్వాలు పూర్తి శ్రద్ధతో పనిచేస్తోంది. భక్తుల సౌలభ్యం కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందులొ భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకుల సౌలభ్యం కోసం సేవలను నిరంతరం విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాగరాజ్ మండలం అన్ని క్యాటరింగ్ స్టాల్ లైసెన్స్ హోల్డర్లకు ఆహార పదార్థాలలో పరిశుభ్రతతో పాటు నిర్ణీత ధరలకు అమ్మకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అదనంగా అన్ని స్టాళ్లలో వస్తువులను సక్రమంగా ఉంచడం, ఉద్యోగులు సరైన దుస్తులు, నేమ్ ప్లేట్ ధరించడంతో పాటు భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని కోరింది.
సేవాభావంతో అత్యుత్తమ సేవలు
సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ హిమాంశు శుక్లా మాట్లాడుతూ... 2025 మహాకుంభ్ కోసం దేశవిదేశాల నుండి కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ వస్తున్నారని అన్నారు. వీరిలో అధిక సంఖ్యలో భక్తులు రైలులో ప్రయాణిస్తారు... వారికి సేవాభావంతో తన అత్యుత్తమ సేవలను అందిస్తామన్నారు. ఇది రైల్వేకి ముఖ్యమైన బాధ్యత...ఇందుకోసం రైల్వే పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు.
క్యాటరింగ్ స్టాళ్లు, ప్రయాణీకుల సౌకర్యాలను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తారు. అన్ని ఆహార సేవలను అందించే లైసెన్స్ హోల్డర్లు వారి బేస్ కిచెన్ వివరాలను వెంటనే అందించాలని కూడా ఆదేశించారు. అన్ని లైసెన్స్ హోల్డర్లకు స్టాళ్లలో విజిటర్ బుక్ ఉంచాలని ఆదేశించారు. ప్రజా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఉద్యోగులు, లైసెన్స్ హోల్డర్ల సూచనలను కూడా ఆహ్వానించారు.
ప్రతిరోజూ 10 లక్షల టిక్కెట్లు పంపిణీ
2025 మహా కుంభమేళా సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం 13,000 కంటే ఎక్కువ రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ తెలిపారు. 10,000 కంటే ఎక్కువ రెగ్యులర్ రైళ్లు, 3,000 కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. ప్రయాగరాజ్ జంక్షన్, సుబేదార్గంజ్, నైనీ, ప్రయాగరాజ్ చివ్కి, ప్రయాగ్ జంక్షన్, ఫాఫాము, ప్రయాగరాజ్ రాంబాగ్, ప్రయాగరాజ్ సంగం, ఝాన్సీతో సహా మొత్తం 9 రైల్వే స్టేషన్లతో పాటు మేళా ప్రాంతంలో యుటిఎస్, ఎటివిఎం, ఎంయుటిఎస్, పిఆర్ఎస్ తో సహా మొత్తం 560 టికెటింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిలో 132 కౌంటర్లను ప్రయాగరాజ్ జంక్షన్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కౌంటర్ల ద్వారా ప్రతిరోజూ దాదాపు 10 లక్షల టిక్కెట్లను పంపిణీ చేయవచ్చు.
కుంభమేళా దృష్ట్యా రైల్వే ఇప్పుడు 15 రోజుల ముందుగానే అడ్వాన్స్ రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించింది. నవంబర్ 1, 2024 నుండి టోల్ ఫ్రీ నంబర్ 1800 4199 139 ని జారీ చేసింది. జనవరి 1, 2025 నుండి ఇది 24 గంటలూ, ప్రతి షిఫ్ట్ కు నలుగురు ఆపరేటర్ల ద్వారా నిర్వహించబడుతుంది. మేళా సమయంలో ఒరియా, తమిళం/తెలుగు, మరాఠీ, బెంగాలీ వంటి భాషలలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం బహుభాషా ప్రకటన వ్యవస్థను ప్రారంభిస్తున్నారు. బహుభాషా ప్రకటన వ్యవస్థ ద్వారా మహాకుంభ్ సమయంలో భక్తులకు ప్రయాణ సంబంధిత సమాచారాన్ని 12 భాషలలో (హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఒరియా, పంజాబీ మరియు అస్సామీ) ప్రకటిస్తారు.