మోదీ బాటలోనే యోగి : సాధుసంతుల కోసం స్పెషల్ ప్రాజెక్ట్, ఖర్చెంతో తెలుసా?
వచ్చే ఏడాది 2025లో జరగనున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళా కోసం యోగి సర్కార్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ మేళాకు విచ్చేసే భక్తులు, పర్యాాటకులు ఆకలితో అలమటించకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
ప్రయాగరాజ్ : వచ్చేఏడాది ఆరంభంలో అంటే 2025 జనవరిలో ఉత్తర ప్రదేశ్ కు భక్తులు, పర్యాటకులు పోటెత్తనున్నారు. ఎందుకంటే 12 ఏళ్ళ తర్వాత ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మహా కుంభమేళా జరగనుంది. యోగి సర్కార్ హయాంలో జరుగుతున్న మొదటి కుంభమేళా ఇది... కాబట్టి అత్యంత వైభవంగా ఈ మేళాను నిర్వహించేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం మోదీ ఫార్ములాను ఫాలో అవుతున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో దేశ ప్రజలు ఆకలిబాధతో అలమటించకుండా ఉచిత రేషన్ అందించారు ప్రధాని మోదీ. దీన్ని ప్రయాగరాజ్ మహా కుంభమేళా సమయంలో యూపీ సీఎం యోగి ఫాలో అవుతున్నారు. ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు విచ్చేసే పర్యాటకులు, భక్తులు, కల్పవాసులు (గంగానది ఒడ్డున నివసిస్తూ కుంభమేళా సమయంలో ధ్యానం, తపస్సులో గడిపే సాధుసంతులు) ఆకలి బాధను తీర్చేందుకు యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రయాగరాజ్ కుంభమేళాలో ఉచిత రేషన్ అందించేందుకు యోగి ప్రభుత్వం సిద్దమయ్యింది. కుంభమేళా ప్రారంభం నుండి ముగిసేవరకు అంటే 2025 జనవరి, ఫిబ్రవరి రెండునెలలపాటు చాలామంది భక్తులు, కల్పవాసులు ప్రయాగరాజ్ లోనే వుంటారు. వీరు ఆకలితో అలమటించకుండా యోగి సర్కాార్ చర్యలు తీసుకుంది. మేళా పరిసరాల్లో గోడౌన్లు ఏర్పాటుచేసి నిత్యావసర సరుకులను సకాలంలో అందించనుంది.
కుంభమేళాలో ఎక్కువరోజులపాటు ప్రయాగరాాజ్ లో వుండే కల్పవాసులు, భక్తులకు రేషన్ కార్డులు జారీ చేసి రేషన్ అందించనుంది యోగి సర్కార్. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారు ఈ ఉచిత రేషన్ పొందవచ్చు. ఆహార, పౌర సరఫరాల శాఖ మేళా ప్రాంతంలోని అన్ని సెక్టార్లలో 160 రేషన్ దుకానాలు ఏర్పాటు చేస్తుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండుసార్లు రేషన్ పంపిణీ చేస్తారు. రేషన్ నిల్వ కోసం 5 గోడౌన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.43 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది.
జనవరి, ఫిబ్రవరిలో రేషన్ పంపిణీ
ప్రయాగరాజ్ మహా కుంభమేళా సమయంలో చాలా మంది భక్తులు త్రివేణి సంగమప్రాంతంలో నివాసముంటారు. వీరిలో సాధుసంతులు కూడా అత్యధికంగా వుంటారు. వీరు తమ ఆహారాన్ని తామే వండుకుంటారు. వీరి సౌలభ్యం కోసం ఆహార, పౌర సరఫరాల శాఖ మేళా ప్రాంతంలోని అన్ని సెక్టార్లలో 160 రేషన్ దుకానాలు ఏర్పాటు చేస్తుంది. వీరికి రేషన్ కార్డులు జారీ చేయడమే కాకుండా, రేషన్ కూడా అందిస్తారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఈ సౌకర్యం ఉంటుంది. ఈ సౌకర్యం 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో రెండుసార్లు అందుబాటులో ఉంటుంది. రేషన్ కొరత లేకుండా ఉండటానికి మేళా ప్రాంతంలోనే 5 గోడౌన్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రకారం కల్పవాసులు, భక్తులకు ఆహార ధాన్యాలు, చక్కెర, వంటగ్యాస్ అందిస్తారు. వంటగ్యాస్ సిలిండర్ల అమ్మకానికి ప్రత్యేక అవుట్‌లెట్లు ఏర్పాటు చేస్తారు. 10 లక్షల శాశ్వత జనాభాతో పాటు తాత్కాలిక జనాభా కోసం భండారాలు ఏర్పాటు చేసి, ప్రతిరోజూ రేషన్ సరఫరా చేస్తారు. ఒక రేషన్ కార్డులో 5 మంది ఉంటారని అంచనా. కాబట్టి రెండు నెలల్లో దాదాపు 2 లక్షల రేషన్ కార్డులు అవసరం అవుతాయి. పెద్ద అఖాడాలు, శిబిరాల్లో ఉండే భక్తులు, కల్పవాసులకు కూడా ఈ సౌకర్యం లభిస్తుంది.
ఈ ప్రాజెక్టు ప్రకారం, రేషన్ కార్డుదారులకు ఒక్కరికి 3 కిలోల చొప్పున గోధుమలు/గోధుమపిండి, 2 కిలోల బియ్యం (ఫోర్టిఫైడ్), 2 కిలోల చక్కెర, 2 లీటర్ల కిరోసిన్ (ప్రతి కార్డుకు), ఒక గ్యాస్ కనెక్షన్ అందిస్తారు. గ్యాస్ కనెక్షన్‌ను ఒకసారి రీఫిల్ చేయించుకునే అవకాశం కూడా ఉంటుంది.