మౌని అమావాస్య రోజున ప్రయాగరాజ్‌లో జరిగిన కుంభమేళాలో అమృత స్నానం సందర్భంగా తొక్కిసలాట జరిగింది. పోలీసుల చర్యల వల్ల పెను ప్రమాదం తప్పింది. లక్షలాది మంది భక్తులు సురక్షితంగా బయటపడ్డారు.
మహాకుంభ నగర్ : ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. గత రాత్రికే ప్రయాగరాజ్ కు భక్తులు పోటెత్తారు... సంగమ తీరానికి కోట్లాదిమంది చేరుకున్నారు. దీంతో రద్దీ పెరిగి ఘాట్ల వద్ద తొక్కిసలాట ఏర్పడింది... దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం తొక్కిసలాట చాలా తీవ్రంగా జరిగింది... కానీ పోలీసులు వెంటనే అప్రమత్తమై చాాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ప్రాణాపాయం తక్కువగా జరిగింది. పోలీసుల తక్షణ చర్యల తీసుకున్నారని... దేవుళ్ళలా వచ్చి కాపాడారని... లేకపోతే తమ ప్రాణాలు కూడా పోయేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాళ్ళ సాయంతో జనాన్ని నియంత్రించారు
ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో మౌని అమావాస్య పర్వదినాన కోట్ల మంది భక్తులు సంగమ తీరంలో ఉన్నారు. అమృత స్నానంకోసం వారి తోసుకోవడంతో తొక్కిసలాట జరిగింది. రాత్రివేళ ఈ తొక్కిసలాట జరిగినా అధికారులు తక్షణమే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది తాళ్ళ సాయంతో జనాన్ని నియంత్రించారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఐజీ ప్రేమ్ కుమార్, మేళా ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది సంఘటనా స్థలానికి చేరుకుని కోట్ల మంది భక్తులను వేర్వేరు మార్గాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రిహార్సల్స్ ఉపయోగపడ్డాయి
ప్రత్యక్ష సాక్షులైన భక్తులు పోలీసులు సకాలంలో చర్యలు తీసుకోకపోతే పెను ప్రమాదం జరిగేదని అన్నారు. యూపీ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని తొక్కిసలాటలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ విపత్కర సమయంలో ముందుగానే రిహార్సల్ చేసిన గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషం అంబులెన్స్‌లు గాయపడిన భక్తులను ఆసుపత్రులకు తరలించాయి. తక్షణ సహాయం, చికిత్స అందించడం వల్ల గాయాల తీవ్రత తగ్గింది.
అప్రమత్తంగా ఉన్న పోలీసులు
కుంభమేళా డీఐజీ వైభవ్ కృష్ణ మాట్లాడుతూ... ఈరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారని, పరిసర ప్రాంతాల నుంచి భారీగా జనం ప్రయాగరాజ్‌కు చేరుకున్నారని, 10 కోట్లకు పైగా భక్తులు వచ్చారని అంచనా వేస్తున్నామని అన్నారు. మంగళవారం రాత్రి నుంచే అధికారులంతా జన నియంత్రణలో నిమగ్నమయ్యారని, సంగమతో సహా అన్ని ఘాట్లలో భక్తులు స్నానం చేస్తున్నారని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, పరిస్థితి సాధరణ స్థితికి చేరుకుందని తెలిపారు.
కుంభమేళా ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది మాట్లాడుతూ... సంగమ ఘాట్ వద్ద తొక్కిసలాట ఏర్పడిందని, పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చామని, భక్తులకు వారు వచ్చిన మార్గాల్లోనే ఘాట్లు తెరిచి ఉన్నాయని, వారు స్నానం చేసి సురక్షితంగా ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
10-12 గంటలు పనిచేస్తున్న యూపీ పోలీసులు
మహా కుంభమేళాలో యూపీ పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. భక్తులకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు. ప్రతి పోలీసు 10-12 గంటలు నిలబడి ప్రజలకు సహాయం చేస్తున్నారు. ప్రజల ఆగ్రహాన్ని తట్టుకుంటూ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రూట్ డైవర్షన్ కూడా ఇందులో భాగమే. భక్తులు వారు వచ్చిన మార్గంలోనే స్నానం చేయాలని అధికారులు కోరుతున్నారు.
