కుంభమేళాకు పోటెత్తిన భక్తులు... ట్రాఫిక్ నియంత్రణకు స్వయంగా రంగంలోకి యోగి

ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లేదారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ కంట్రోల్ కోసం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.  

Prayagraj Kumbh Mela 2025 Traffic Management and Safety Instructions by CM Yogi Adityanath in telugu akp

Kumbh Mela 2025 : ప్రయాగరాజ్ కుంభమేళాలో ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేలా ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కుంభమేళాకు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా చూడాలని... వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా చూడాలని ఆయన అన్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగరాజ్‌కు వస్తున్నందున ఏ మార్గంలోనూ ట్రాఫిక్ జామ్ ఉండకూడదని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచించారు.

మాఘ పౌర్ణమి స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు

మాఘ పౌర్ణమి స్నానం సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వసంత పంచమి రోజులాగే ఈ రోజు కూడా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, జనసమూహాల నియంత్రణను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ స్థాయి ఉన్నతాధికారులతో పాటు ప్రయాగరాజ్, కౌశాంబి, కాన్పూర్, సుల్తాన్‌పూర్, అమేథీ, వారణాసి, అయోధ్య, మీర్జాపూర్, జౌన్ పూర్, చిత్రకూట్, బాందా, ప్రతాప్‌గఢ్, భదోహి, రాయ్‌బరేలీ, గోరఖ్‌పూర్, మహోబా, లక్నోతో సహా ఇతర జిల్లాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

భక్తుల సౌకర్యమే ముఖ్యం

ప్రయాగరాజ్‌లో పెరుగుతున్న జనసమూహాల దృష్ట్యా పార్కింగ్ స్థలాలను సమర్థవంతంగా నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగరాజ్ సరిహద్దుల్లో ఐదు లక్షలకు పైగా వాహనాలను పార్క్ చేసే సామర్థ్యం ఉంది, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భక్తులు ట్రాఫిక్ నియమాలు పాటించేలా ప్రోత్సహించాలి, రోడ్లపై వాహనాలు నిలిచిపోకుండా చూడాలన్నారు. అవసరమైనన్ని షటిల్ బస్సులను ఏర్పాటు చేసి, రాకపోకలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు..

ప్రయాగరాజ్‌కు ఆనుకుని ఉన్న జిల్లాల కలెక్టర్లు ప్రయాగరాజ్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రైల్వే స్టేషన్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వే అధికారులతో సంప్రదించి రైళ్ల సంఖ్య పెంచాలని ఆదేశించారు. అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

కుంభమేళాలో పరిశుభ్రతకు ప్రాధాన్యత

ప్రయాగరాజ్ కుంభమేళాకు పరిశుభ్రతే ముఖ్యమని, దానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గంగా, యమునా నదుల్లో పూలు, దండలు వేయడం వల్ల కాలుష్యం పెరుగుతుంది కాబట్టి, పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలి. గంగా, యమునా నదుల్లో నీటి లభ్యతను ఖచ్చితంగా చూడాలి. కుంభమేళా ప్రాంతంలో అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్ స్థాయిలో 28 మందితో సహా పలువురు పోలీసు అధికారులను నియమించారు.

భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు కఠిన ఆదేశాలు

ప్రయాగరాజ్ రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగేలా పోలీసు పెట్రోలింగ్ పెంచాలని ముఖ్యమంత్రి అన్నారు. రీవా మార్గం, అయోధ్య-ప్రయాగరాజ్, కాన్పూర్-ప్రయాగరాజ్, ఫతేపూర్-ప్రయాగరాజ్, లక్నో-ప్రతాప్‌గఢ్-ప్రయాగరాజ్, వారణాసి-ప్రయాగరాజ్ మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కాకూడదు. క్రేన్లు, అంబులెన్స్‌లు తగినన్ని ఉండేలా చూడాలి.

ఇప్పటివరకు 44.75 కోట్ల మంది భక్తులు స్నానం చేశారు

ఇప్పటివరకు 44 కోట్ల 75 లక్షలకు పైగా భక్తులు సంగమ స్నానం చేశారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమావేశంగా మారిందని ఆయన అన్నారు. మేళా ఏర్పాట్లను సజావుగా నిర్వహించడంతో పాటు, ప్రయాగరాజ్ స్థానికుల సౌకర్యాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 12న సాధువు రవిదాస్ జయంతి సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు

ఫిబ్రవరి 12న సాధువు రవిదాస్ జయంతి సందర్భంగా వారణాసిలోని సీర్ గోవర్ధన్‌పూర్‌తో సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. కుంభమేళాకు వచ్చే భక్తులు వారణాసి, అయోధ్యలలో కూడా దర్శనం చేసుకుంటున్నారు. దీంతో చిత్రకూట్, మీర్జాపూర్‌లలో కూడా భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఈ నగరాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు

ఏదైనా తప్పుడు సమాచారం లేదా అవాస్తవాలను వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుంభమేళాను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి, భక్తుల భద్రతను ఖచ్చితంగా చూడాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios