ప్రయాగరాజ్: ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆమె మాటలు నమ్మి మొత్తం కుటుంబ సభ్యులను హతమార్చాడు. తల్లిదండ్రులను, కూతురును, భార్యను చంపించాడు. కిరాయి రౌడీలకు 8 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి చంపించి ఏమీ ఎరగనట్లు నటించాడు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ ప్రీతమ్ నగర్ చెందిన తన తల్లిదండ్రులైన తులసీదాస్ (65), ఆయన భార్య కిరణ్ (60)లను, తన భార్య ప్రియాంక (22), సోదరి నిహారిక (37)లను అతిష్ అనే వ్యక్తి హత్య చేయించాడు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన తులసీదాస్ కు అతీష్ ఒక్కడే కుమారుడు. 

తన కుటుంబ సభ్యులు మరణించిన సమాచారాన్ని అతీష్ పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు సాగించారు. ఇంటి సీసీటీవీ ఫుటేజీ పని చేయడం లేదు. వీడియో రికార్డుల పాస్ వర్డ్ ఇవ్వడానికి అతీష్ నిరాకరించాడు. దీంతో పోలీసులకు అనుమానం ప్రారంభమైంది. 

అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించాడు. దాంతో అతను నేరం అంగీకరించాడు. అతీష్ అదే ప్రాంతానికి చెందిన రంజనా శుక్లాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అతని ఆస్తిపై ఆమె కన్నేసింది. ఆస్తి కోసం అతన్ని నమ్మించి హత్యకు పురమాయించినట్లు చెబుతున్నారు. 

అతీష్ అనుజ్ శ్రీవాస్తవ అనే కిరాయి హంతకుడికి 8 లక్షల రూపాయల సుపారీ ఇచ్చాడు. హంతకుడు శ్రీవాస్తవను, అతనికి సహకరించిన ఉమేంద్ర ద్వివేదిని, అతీష్, రంజనా శుక్లాలలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, లక్ష రూపాయల నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.