ఉత్తరప్రదేశ్ లో ఆదివారం ఐదో దశ ఎన్నికలు జరగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. దీంతో ఘటనా పరిసర ప్రాంతంలో ఉన్న పోలింగ్ బూత్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక యువకుడు చనిపోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యారు. 

ఉత్త‌ర ప్ర‌దేశ్ (uttar pradesh)లోని ప్ర‌యాగ్ రాజ్ (Prayagraj)లో ఆదివారం పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మ‌రో యువ‌కుడు గాయాల పాల‌య్యాడు. ప్ర‌స్తుతం గాయ‌ప‌డిన వ్య‌క్తి హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నాడు. వీరిద్ద‌రు రామ్‌గఢ్‌ గ్రామానికి చెందిన వారని, సైకిల్‌పై ప్రయాణిస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. 

వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఐదో ద‌శ ఎన్నిక‌లు నిర్వ‌హించారు. అయితే ఆదివారం మధ్యాహ్నం 3:45 గంటలకు సంగమ్ నగరంలోని కరేలి (kareli) ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం సమీపంలో అనుమానాస్పద ముడి బాంబు పేలింది. ఇందులో 21 ఏళ్ల యువకుడు మరణించాడు. అదే వయస్సు గల మ‌రో వ్య‌క్తి గాయ‌ప‌డ్డాడు. అయితే ఈ ఘ‌ట‌న స‌మీపంలోని లేఖపాల్ ట్రైనింగ్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో గందరగోళం సృష్టించింది. సీనియర్ పోలీసు అధికారులు వివిధ పోలీసు బృందాలతో అక్కడికి చేరుకుని శాంతిభద్రతలను పునరుద్ధరించారు.

ప్రయాగ్‌రాజ్ జిల్లా ఎన్నికల అధికారి సంజయ్ కుమార్ ఖత్రీ ( Sanjay Kumar Khatri) మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను భారత ఎన్నికల కమిషన్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు పోలింగ్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. మృతుడు ట్రాన్స్-యమునా కొరాన్ లోని రామ్‌గఢ్ గ్రామానికి చెందిన బాబులాల్ కుమారుడు అర్జున్ కోల్ (arjun kol) (21)గా గుర్తించామ‌ని ప్రయాగ్‌రాజ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ కుమార్ (Ajay Kumar) చెప్పారు. అతనితో పాటు ఉన్న మరో యువకుడు అదే ప్రాంతానికి చెందిన సంజయ్ కోల్‌గా గుర్తించామని ఆయన తెలిపారు. అయితే పోలింగ్ కు ఈ ఘ‌ట‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని త‌మ ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో నిర్ధార‌ణ కాలేద‌ని చెప్పారు. 

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్జున్, సంజయ్ (sanjay) కూలీలు. కాంట్రాక్టర్ జుబేర్ వద్ద పని చేస్తూ కరేలీలోని గౌస్ నగర్ (gouse nagar) ప్రాంతంలో నివసించేవారు. ఘటన జరిగినప్పుడు తాము మొబైల్ ఫోన్ కొనేందుకు వెళ్తున్నామని సైకిళ్ల పై బ‌యలుదేరారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు వారిద్ద‌రి సైకిళ్లు ఒక దానిని ఒక‌టి ఢీకొన్నాయి. దీంతో ఓ యువ‌కుడు కింద పడిపోయాడు. కొంత స‌మ‌యం వ్య‌వ‌ధిలోనే పేలుడు సంభ‌వించింది. దీంతో అర్జున్ అక్కడే చనిపోయాడు. అయితే పేలుడుకు అస‌లు కార‌ణం ఏంటో ఇంకా పూర్తిగా తెలియ‌రాలేదు. ఫోరెన్సిక్ బృందం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ నిపుణులు ఘటనా స్థలం నుంచి నమూనాలను సేకరించారు. యువకుడు క్రూడ్‌బాంబ్‌ను తన వెంట తీసుకెళ్తున్నాడని, అతను కిందపడగానే పేలిపోయిందని నిపుణులు పేర్కొన్నారు. మృత‌దేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. గాయ‌ప‌డిన వ్య‌క్తిని హాస్పిట‌ల్ కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. శనివారం మణిపూర్ రాష్ట్రంలోని చురచంద్ పూర్ (Churachandpur) జిల్లా గ్యాంగ్పిమువల్ (Gangpimual) గ్రామంలో ఓ ఇంట్లో బాంబు పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ చిన్నారితో పాటు ఓ వ్య‌క్తి కూడా మృతి చెందాడు. మ‌రో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మ‌ణిపూర్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే ఒక రోజు ముందు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.