ప్రశాంత్ కిశోర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీని ఓడించాలంటే థర్డ్ ఫ్రంటో, ఫోర్త్ ఫ్రంటో కాదు.. సెకండ్ ఫ్రంట్‌తోనే సాధ్యం అని స్పష్టం చేశారు. ఏ పార్టీ అయినా.. బీజేపీని ఓడించదలుచుకుంటే సెకండ్ ఫ్రంట్‌గా ఎదగాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫ్రంటా అన్న ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొన్నాళ్లుగా కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు చాలా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా పీకే చేరికపై మేధోమథనం జరిగింది. నాయకులతో సంప్రదింపులు జరిగాయి. కానీ, చివరకు పీకే కాంగ్రెస్‌లో చేరలేదు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిశోర్ చేరకపోవడం కూడా పెద్ద పరిణామంగా మారడం ఆయన స్ట్రాటజీ సక్సెస్ రేట్‌ను వెల్లడిస్తున్నది. పీకే కాంగ్రెస్‌లో చేరలేదు, కానీ, పలు ప్రాంతీయ పార్టీలతో ఆయనకు ఎన్నికల ఒప్పందాలు ఉన్నాయి.
ఎన్నికల వ్యూహాల్లో అందె వేసిన చేయి కావడంతో ఆయన పలుకు జగదాంబ పలుకు టైపు. అంటే ఏ వ్యాఖ్య చేసినా ఇట్టే ఆకర్షితమవుతుంది. తాజాగా, బీజేపీని ఓడించాలంటే థర్డ్ ఫ్రంట్, లేదా ఫోర్త్ ఫ్రంట్‌తోనే సాధ్యం కాదని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలంటే సెకండ్ ఫ్రంట్‌తోనే అది సాధ్యం అని తెలిపారు. ఏ పార్టీ అయినా.. బీజేపీని ఓడించాలంటే సెకండ్ ఫ్రంట్‌గా ఎదగాలని సూచించారు.
ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 2024 జనరల్ ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్‌గా ఎదగడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఆయన సహకరిస్తున్నారా? అని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ దేశ సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఫ్రంటో లేదా నాలుగో ఫ్రంటో గెలుస్తుందంటే తాను నమ్మనని పేర్కొన్నారు. బీజేపీని ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ అని భావిస్తే.. దాన్ని ఓడించాలంటే సెకండ్ ఫ్రంటే ఉండాలని వివరించారు. ఏ పార్టీ అయినా సరే బీజేపీని ఓడించాలని ఆలోచిస్తే ఆ పార్టీ దేశంలో సెకండ్ ఫ్రంట్‌గా ఎదగాలని తెలిపారు.
అదే సందర్భంలో కాంగ్రెస్ గురించి ఆయనను ఓ కీలక ప్రశ్న వేశారు. మీ దృష్టిలో దేశంలో సెకండ్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీనేనా? అని అడిగారు. అందుకు ఆయన సమాధానంగా కాదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫ్రంట్ కాదు కానీ.. అది రెండో అతిపెద్ద పార్టీ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్సేతర థర్డ్ ఫ్రంట్ కూటమితో లాభం లేదని, ఆ థర్డ్ ఫ్రంట్ బీజేపీని ఓడించజాలదని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. టీఎంసీ, టీఆర్ఎస్, శివసేన, ఇతర పార్టీలు అన్నీ కలిసి సొంత కుంపటిగా ఓ ఫ్రంట్ పెడితే గెలవరని, అవన్నీ కాంగ్రెస్‌ను కలుపుకుపోతేనే సత్ఫలితం ఉంటుందని చెప్పారు. తాజాగా, ఆయన కాంగ్రెస్‌లో చేరకపోయినా.. అదే మాటను మరోమారు వినిపించారు. కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీ కావునా.. ప్రాంతీయ పార్టీలు అన్ని దానితో జతకడితే ఫలితాలు ఉంటాయని చెప్పినట్టయింది. ఎందుకంటే.. ఈ స్వల్ప సమయంలో బీజేపీ తర్వాత సెకండ్ ఫ్రంట్‌గా ఒక ప్రాంతీయ పార్టీ ఎదగడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి.
ఇదిలా ఉండగా, ప్రశాంత్ కిశోర్ ఇంకా తమతో ఉన్నాడని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా, ఓ ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎస్‌తో ఐప్యాక్ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకత్వ ఫార్ములాలో ప్రశాంత్ కిశోర్ మార్పులు సూచించారని, ఈ మార్పులపై ఏకాభిప్రాయం కుదరలేదని భోగట్టా.
