న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పెద్దల సభలో అడుగు పెట్టే అవకాశం ఉంది. మార్చిలో జరిగే ఎన్నికల్లో ఆయన రాజ్యసభకు ఎన్నికవుతారనే ప్రచారం సాగుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసబ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పశ్చిమ బెంగాల్ నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నలుగురు టీఎంసీ సభ్యులు రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. టీఎంసి బలం మేరకు నాలుగు స్థానాలను కూడా టీఎంసీ దక్కించుకునే అవకాశం ఉంది.

దాంతో కేంద్రంలోని బిజెపిని ఎదుర్కునేందుకు సమర్థవంతమైన నాయకులను రాజ్యసభకు పంపించాలని మమతా బెనర్జీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిశోర్ ను రాజ్యసభకు నామినేట్ చేయాలని మమతా బెనర్జీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

బిజెపి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సీఏఏ వంటి చట్టాలను ప్రశాంత్ కిశోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ కారణంగానే ఆయన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయు నుంచి బహిష్కరణకు గురయ్యారు. దాంతో ప్రశాంత్ కిశోర్ ను రాజ్యసభకు పంపించాలని మమతా బెనర్జీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెసును గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ మమతా బెనర్జీతో ఒప్పందం చేసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఏమిటనేది తెలియడం లేదు. బాత్ బీహార్ కీ పేరుతో ఇంటింటికి వెళ్తామని చెప్పిన ప్రశాంత్ కిశోర్ ఏయే శక్తులను కూడగడుతారనేది ఆసక్తిగా మారింది.