ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ రాజకీయ నేతగా మారారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమక్షంలో ఆయన ఇవాళ జేడీయూలో చేరారు.

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్ రాజకీయ నేతగా మారారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సమక్షంలో ఆయన ఇవాళ జేడీయూలో చేరారు.. పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రశాంత్‌కు పార్టీ జెండా కప్పి నితీష్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

కొద్దిరోజుల క్రితం తాను 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి పనిచేయను అని చెప్పిన ప్రశాంత్ సొంతరాష్ట్రం బిహార్‌కు వెళ్లిపోతానని ప్రకటించారు. అయితే ప్రశాంత్ జేడీయూలో చేరుతారని ముందు నుంచి ఊహాగానాలు వినిపించాయి. వీటిని ప్రజలు గాలివార్తలుగా ప్రకటించినప్పటికీ.. చివరికి అవే నిజమయ్యాయి.

బిహార్‌లోని సాసారామ్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం 2015 బిహార్ ఎన్నికల సమయంలో మహాకూటమి తరపున వ్యూహకర్తగా పనిచేసి... ఎన్నికల్లో విజయం సాధించి పెట్టారు. అయితే ఆ తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహాకర్తగా పనిచేసి ఆ పార్టీని గట్టెక్కించలేకపోయారు.

2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అమరీందర్ సింగ్‌కి సలహాదారుడిగా పనిచేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశాంత్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించింది. అయితే ఇటీవల హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తాను 2019 ఎన్నికల్లో ఏ పార్టీ తరపునా పోటీ చేయనని తెలిపారు.