రాజస్థాన్ లోని కోటాలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేనందుకు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ బస్సులు పంపడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. 

ఇలా అంతర్రాష్ట్ర ప్రయాణాల వల్ల లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజల ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టినట్టు అవుతుందని నితీష్ కుమార్ యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ఇలా నీతులు చెప్పే నితీష్ కుమార్ తాను మాత్రం పాటించడని ఎద్దేవా చేసారు జేడీయూ బహిష్కృత నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇలా యోగి ఆదిత్యనాథ్ పై తీవ్ర విమర్శలు చేసిన నితీష్ కుమార్, రెండు రోజుల తర్వాత  అదే కోటాలో చదువుకుంటున్న, ఇతర బీహార్ విద్యార్థులతోపాటు  అక్కడే చిక్కుబడిపోయిన  బీహార్ బీజేపీ ఎమ్మెల్యే అనిల్ సింగ్ తనయుడిని వెనక్కి తీసుకురావడానికి పాస్ ను జారీ చేసాడు.  

ఈ పాస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్...రాజస్థాన్ లో చిక్కుకున్న ఇతర బీహార్ విద్యార్థులను వెనక్కి తీసుకురావడానికి లాక్ డౌన్ కారణం చెప్పి కుదరదన్న నితీష్ కుమార్ గారు, బీజేపీ ఎమ్మెల్యే కొడుకును వెనక్కి తీసుకురావడానికి మాత్రం పాసును జారీ చేసారు. ఇప్పుడు మీ మర్యాద ఏమైందండీ నితీష్ కుమార్ గారు అంటూ ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ కూడా నితీష్ పై విరుచుకుపడ్డారు. ఒకపక్కనేమో యోగి ఆదిత్య నాథ్ బస్సులు పెట్టినప్పుడు వద్దు అన్న నితీష్ గారు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కొడుకుని వెనక్కి తీసుకురావడానికి మరో చేత్తో పాసులను జారీ చేస్తున్నారు. ఇలా బీహార్ లో ఇప్పటికే ఎన్నో వీఐపీ పాసులను జారీ చేసారు. పాపం పేదలు అని ట్వీట్ చేసారు.