Asianet News TeluguAsianet News Telugu

ప్రసాదంలో విషం: 15 మంది భక్తుల ప్రాణాలు తీసిన ‘‘పగ’’

కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా సుళ్వాడిలో విషపూరిత ప్రసాదం తిని 15 మంది భక్తుల మరణం వెనుక మిస్టరీని పోలీసులు చేధించారు. బోర్డు సభ్యునితో ఉన్న విభేదాల కారణంగా ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ పన్నిన కుట్ర కారణంగానే ఇంతటి విషాదం చోటు చేసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

prasadam poisoning case in chamarajanagar maremma temple
Author
Chamarajanagar, First Published Dec 20, 2018, 1:36 PM IST

కర్ణాటక రాష్ట్రం చామరాజనగర జిల్లా సుళ్వాడిలో విషపూరిత ప్రసాదం తిని 15 మంది భక్తుల మరణం వెనుక మిస్టరీని పోలీసులు చేధించారు. బోర్డు సభ్యునితో ఉన్న విభేదాల కారణంగా ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ పన్నిన కుట్ర కారణంగానే ఇంతటి విషాదం చోటు చేసుకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయ ట్రస్టులో చిన్నప్పి అనే వ్యక్తి సభ్యునిగా కొనసాగుతున్నారు. ట్రస్ట్ ఆదాయ, నిర్వహణ తదితర అన్ని బాధ్యతలను చిన్నప్పి నిర్వర్తిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో.. బోర్డుతో పాటు ఆలయంలోనూ అతని ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది.

ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది కూడా చిన్నప్పికే ఎక్కువ విలువ ఇస్తుండటంతో ఛైర్మన్ ఇమ్మడి మహదేవస్వామికి అసూయ కలిగించింది. దీంతో చిన్నప్పితో విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కొద్దినెలల క్రితం మారమ్మ ఆలయానికి రూ.1.50 కోట్లతో కొత్త గోపురాన్ని నిర్మించాలని మహదేవస్వామి తీర్మానించగా.. దానిని చిన్నప్పి వ్యతిరేకించాడు.

అంత ఖర్చు అవసరం లేదని కేవలం రూ.80 లక్షల నిధులతో చిన్నగోపురం నిర్మిస్తే సరిపోతుందంటూ ప్రతిపాదించాడు. అదే సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం, వైషమ్యాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో చిన్నప్పి 14వ తేదీన సాలూరు మఠాధిపతి గురుస్వామిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి దేవాలయం గోపుర నిర్మాణానికి పూజలు పూజ కార్యక్రమాలు జరిపాడు.

దీనిని జీర్ణించుకోలేని మహదేవస్వామి చిన్నప్పితో పాటు అతనికి అండగా ఉన్న ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బందిపై పగ సాధించాలనుకున్నాడు. దీనిలో భాగంగా తన మేనకోడలు అంబికా, ఆమె భర్త ఆలయ మేనేజర్ మాదేశ్, అర్చకుడు దొడ్డయ్యతో కలిసి పథకం పన్నాడు.

ప్లాన్‌లో భాగంగా గోపురం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే భక్తులకు పంచేందుకు సిద్ధం చేసిన ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే విష రసాయనాన్ని కలపాలని నిర్ణయించాడు. అంబిక తన దూరపు బంధువైన వ్యవసాయాశాఖలో పనిచేసే అధికారి దగ్గరి నుంచి మోనోక్రోటోఫాస్ తెప్పించి దానిని భర్త మాదేశ్‌కు అప్పగించింది.

దీనిని అర్చకుడు దొడ్డయ్యకు అందించాడు. అనంతరం వంటగదిలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి... దొడ్డయ్య ప్రసాదంలో విష రసాయనాన్ని కలిపి వచ్చేశాడు. అయితే ప్రసాదం నుంచి దుర్వాసన వస్తుండటంతో తొలుత సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు.  మసాలా దినుసులు ఎక్కువై ఉంటాయని వారు కప్పిపుచ్చారు.

భక్తులు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేయడంతో పచ్చ కర్పూరం ఎక్కువైందని చెప్పారు. ఇది నమ్మిన భక్తులు ప్రసాదాన్ని తిన్నారు.. ఆ తర్వాత కొద్దిసేపటికే వందమందికి పైగా భక్తులు వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు.

తమపై అనుమానం రాకుండా ఉండేందుకు గాను అర్చకుడు దొడ్డయ్య కూడా తాను కూడా ప్రసాదం తిన్నానని ఆస్పత్రిలో చేరాడు. అయితే దొడ్డయ్యను క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు ఆయన శరీరంలో ఎలాంటి విష పదార్ధాలు లేవని గుర్తించడంతో పాటు అతనిపై అనుమానం వ్యక్తం చేశారు.

వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో దొడ్డయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. అలాగే అంబిక కాల్‌లిస్ట్‌ను పరిశీలించగా... ఘటన జరగడానికి ముందు ఆమె తన దూరపు బంధువైన వ్యవసాయ శాఖాధికారితో ఎక్కువసార్లు మాట్లాడినట్లుగా గుర్తించారు.

ఇద్దరిని విచారించగా నేరం అంగీకరించారు. అదే విధంగా సాలూరు మఠాధిపతి గురుస్వామితో కూడా మహదేవస్వామికి విభేదాలున్నాయి. గోపుర శంకుస్థాపన రోజు చిన్నిప్పి, గురుస్వామికి ప్రసాదం తినిపిస్తే సాలూరు మఠం కూడా తన సొంతమవుతుందని కుట్రపన్నినట్లుగా తెలుస్తోంది.

అయితే గురుస్వామి, చిన్నిప్పి ప్రసాదం దుర్వాసన రావడంతో దానిని తినకుండానే వెళ్లిపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. సుమారు 15 బాటిళ్ల పురుగు మందు కలపడంతో గాఢత ఎక్కువై మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ప్రసాదం తిన్నవారిలో చాలామంది ఇప్పటికీ మైసూర్ ఆలయంలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ.5 లక్సల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios