Asianet News TeluguAsianet News Telugu

ఎన్‌డీటీవీ బోర్డు నుంచి వైదొలిగిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్..

ఎన్‌డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయడంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ఆ సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. 

Prannoy Roy and Radhika Roy quit as directors of NDTV promoter company
Author
First Published Nov 30, 2022, 11:12 AM IST

ఎన్‌డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయడంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ ఆ సంస్థ బోర్డు నుంచి వైదొలిగారు. మీడియా హౌస్‌లో 29.2 శాతం వాటాను కలిగి ఉన్న ప్రమోటర్ల ప్రధాన హోల్డింగ్ ఎంటిటీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాని వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధిక రాయ్ మంగళవారం రాజీనామా చేశారు. అదే సమయంలో ముగ్గురు కొత్త వ్యక్తులు.. సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నయ్య చెంగల్వరాయన్ కంపెనీ బోర్డులో డైరెక్టర్లుగా చేరారు. ఈ మేరకు కంపెనీ మంగళవారం బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. ఇక,సంజయ్ పుగాలియా అదానీ గ్రూప్‌లో మీడియా వ్యవహారాలకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.

గతంలో విశ్వప్రధాన్ కమర్షియల్ (వీసీపీఎల్)కి జారీ చేసిన వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చినట్లు ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్  సోమవారం ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఈక్విటీ షేర్లుగా మార్చడం వల్ల.. అదానీ గ్రూప్ నియంత్రణలో ఉన్న వీసీపీఎల్ కంపెనీ ఇప్పుడు ఎన్‌డీటీవీలో ప్రమోటర్ 29.2 శాతం వాటాను కలిగి ఉంటుంది. 

దాదాపు దశాబ్దం క్రితం ఎన్‌డీటీవీ కార్యకలాపాలను అమలు చేయడానికి ఉపయోగించిన రుణాన్ని పొందేందుకు వీసీపీఎల్‌కి ఈక్విటీ షేర్‌లుగా మార్చదగిన వారెంట్‌లను ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ జారీ చేసింది. వీటన్నింటినీ షేర్‌లుగా మార్చినట్లయితే ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్‌పై దాదాపు పూర్తి నియంత్రణ వీసీపీఎ‌ల్‌కి మారుతుంది. ఈ ఏడాది మేలో అదానీ గ్రూప్ వీసీపీఎల్‌పై నియంత్రణను తీసుకుంది. వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చాలని కోరింది. దీని తరువాత అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ద్వారా ఎన్‌డీటీవీలో 26 శాతం ఎక్కువ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే విషయాన్ని మార్కెట్‌కు తెలియజేసింది. ఈ ఆఫర్‌ను ఇటీవల సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఈ క్రమంలోనే వీసీపీఎల్, రెండు అదానీ గ్రూప్ సంస్థలు(ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్) సెబీ టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా ఎన్‌డీటీవీలో అదనంగా 26 శాతం కొనుగోలు చేయడానికి నవంబర్ 22న తన ఓపెన్ ఆఫర్‌ను ప్రారంభించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios