న్యూఢిల్లీ:  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు మంగళవారం నాడు మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో నిర్వహించారు.న్యూఢిల్లీలోని రాజాజీ మార్గ్ లోని ప్రణబ్ నివాసం నుండి లోధి రోడ్డులోని స్మశానవాటికలో ప్రణబ్ అంత్యక్రియలను నిర్వహించారు.

సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించారు.. ప్రణబ్ పార్థీవ దేహంపై జాతీయ పతాకాన్ని ఉంచారు సైనికులు.ప్రణబ్ భౌతిక కాయం వద్ద సర్వమత ప్రార్ధనలను నిర్వహించారు. కోవిడ్ నిబంధనలతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలను నిర్వహించారు. 

స్మశాన వాటికలో కుటుంబ సంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాలను కుటుంబసభ్యులు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా సైనికులు గాడ్ ఆఫ్ ఆనర్ నిర్వహించారు.

ఇవాళ ఉదయం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు ప్రణబ్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. గత నెల 10వ తేదీన అనారోగ్యంతో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీ చేరారు. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు సాయంత్రం ప్రణబ్ ముఖర్జీ మరణించాడు. 2012-2017 కాలంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పనిచేశారు.