న్యూడిల్లీ: కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. 84 సంవత్సరాల వయసున్న ఆయన ఇటీవలే కరోనా బారిన పడటంతో తీవ్రంగా అనారోగ్యంపాలయ్యారు. ఈ క్రమంలో ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన మృత్యువాత పడినట్లు కుమారుడు అభిజిత్ ముఖర్జీ ప్రకటించారు.

ప్రణబ్ ముఖర్జీ మృతిపై ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్విట్టర్ వేదికన స్పందించారు. ''మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ మృతిచెందడం అత్యంత బాధాకరం. ఆయన మరణం ఒక శకం ముగిసింది. ప్రజా జీవితంలో గొప్పతనాన్ని చాటుకుంటూ భరతమాత సేవ చేయడమే పరమావదిగా ఆయన పనిచేశారు. కాబట్టి దేశం అత్యంత విలువైన కుమారులలో ఒకరిని కోల్పోయినట్లుంది. ఆయన కుటుంబం, స్నేహితులు మరియు దేశ పౌరులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని అన్నారు. 

 

''భారతరత్న శ్రీ ముఖర్జీ సాంప్రదాయాలను, ఆధునికతను మిళితం చేశారు. తన 5 దశాబ్దాల సుదీర్ఘమైన ప్రజా జీవితంలో ఆయన కార్యాలయాలతో సంబంధం లేకుండా ఉన్నతమైన భూమిక పోషించారు. ఆయన తన రాజకీయ జీవితంలో తన ప్రజలను ఎంతగానో ఇష్టపడ్డారు'' అని తెలిపారు. 


 
''దేశ మొదటి పౌరుడిగా రాష్ట్రపతి భవన్‌ను ప్రజలకు దగ్గర చేస్తూ అందరితో మంచి సంబంధాలను కొనసాగించారు. రాష్ట్రపతి భవన్ ద్వారాలను ప్రజల సందర్శన కోసం తెరిచారు. గౌరవప్రదమైన 'హిస్ ఎక్సలెన్సీ' వాడకాన్ని నిలిపివేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనది'' అంటూ ట్విట్టర్ వేదికన ప్రణబ్ ముఖర్జీని పొగిడారు రామ్ నాథ్ కోవింద్.