భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న తుదిశ్వాస విడిచారు. మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడం కోసం శస్త్ర చికిత్స నిర్వహిస్తుండగా కోమాలోకి జారుకున్నారు. అప్పటినుండి కోమాలోనే కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ ఇందాక తుదిశ్వాస విడిచారు. 

ప్రణబ్ రాజకీయ జీవితం చూడడానికి చాలా తేజోవంతంగా కనబడ్డప్పటికీ... ఆయన రెండు సార్లు ప్రధాని అయ్యే అదృష్టాన్ని తృటిలో కోల్పోయారు. 1984లో ఒకసారయితే... 2009లో మరోసారి. 1984 నుండి 2009 వరకు ఆయన ప్రధానమన్తరి రేసులో ఉన్నారంటే... ఆయన రాజకీయ కెరీర్ ఏ స్థాయిలో ఎంత కాలంపాటు శోభిల్లిందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

ప్రణబ్ ముఖర్జీ ఎంత తెలివిగలవారో అంతే జ్ఞాపక శక్తి కలిగిన వారు. కంప్యూటర్లను మించిన మేధస్సు, జ్ఞాపకశక్తి ఆయనవి. ఒకేసారి ఎవరినయినా కలిస్తే... వారి పేరును మర్చిపోయేవారు కాదు. అందరితో చాలా బాగా మాట్లాడే ప్రణబ్ ముఖర్జీకి షార్ట్ తెంపెర్ కూడా ఎక్కువ. చిన్న విషయాలకు కూడా ఆయన కోపగించుకున్న సందర్భాలు బోలెడు. 

ప్రణబ్ వ్యక్తిగత విషయాలను పక్కకుంచితే.... ప్రణబ్ 1984లో ఒకసారి, 2009లో మరోసారి ప్రధాని అవ్వవలిసింది. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఆ పరిస్థితులు ఏమిటి, అప్పుడు జరిగిందాలేమిటి అనేవాటిని ఒకసారి పరిశీలిద్దాము. 

ప్రణబ్ ముఖర్జీ లైం లైట్ లోకి వచ్చింది ఎమర్జెన్సీ అనంతరం ఇందిరా మలిదఫా అధికారాన్ని చేపట్టిన తరుణంలో. అంతకుముందు కూడా ప్రణబ్ ముఖర్జీ మంత్రిగా పనిచేసినప్పటికీ... ఆయన కంటూ ఒక గుర్తింపు, ఆయన ఒక వెలుగు వెలిగింది 1980ల్లో. 

ఆయన ఆ సమయంలో ఆర్థికమంత్రిగా పనిచేసారు. ఆయన మేధస్సును గుర్తించిన ఇందిరా గాంధీ.... ఆయనకు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. ఆయనే అప్పుడు కాబినెట్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉండేవాడు. ఇందిరా గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనే కాబినెట్ సమావేశాలను కూడా నిర్వహిస్తూ ఉండేవాడు. 

ఇలా ఇందిరా గాంధీకి దగ్గరగా ఉండడమే అతనిని ప్రధాని పదవి నుండి దూరం చేసింది. 1984లో ఇందిరాగాంధీ పై కాల్పులు జరిగిన సమయంలో ప్రణబ్, రాజీవ్ గాంధీలు ఇద్దరు బెంగాల్ లో ఉన్నారు. ఫ్లైట్ లో ఉండగా ఇందిరా ఆసుపత్రిలో మరణించారన్న సమాచారం వచ్చింది. ప్రణబ్ ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు. 

విమానంలో ప్రణబ్ ముందు కూర్చిని ఉండగా రాజీవ్ గాంధీ వెనుకాల తన కోటరీ తో కూర్చొని ఉన్నాడు. ఇందిరా మరణించారన్న వార్త తెలుసుకున్నాక, పరిపాలన ఆగకూడదు కాబట్టి పైలట్ రేడియో ద్వారా ఎయిర్ పోర్ట్ కి త్రివిధ దళాధిపతులు, కాబినెట్ సెక్రటరీని రమ్మని కబురు పెట్టారు. 

అంతకుముందు వరకు నెహ్రు, శాస్త్రిల మరణానంతరం తాత్కాలిక ప్రధానిని నియమించారు. కానీ అందుకు భిన్నంగా ప్రణబ్ మాట్లాడడంతో ఒక్కసారిగా రాజీవ్ గాంధీ కోటరీ అవాక్కయింది. దానికి తోడు విమానాశ్రయంలో ప్రణబ్ ఆదేశాల కోసం అందరూ ఎదురు చూస్తూ, ప్రణబ్ కాబోయే ప్రధాని అన్నట్టుగా ప్రవర్తించడంతో రాజీవ్ కోటరీలో వారికి అది గిట్టలేదు. 

అప్పటికే రాజీవ్ గ్యాంగ్ కి ప్రణబ్ కి పెద్దగా పడేది కాదు. దానితో రాజీవ్ ప్రణబ్ ని దూరం పెట్టాడు. రాజీవ్ ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ క్యాబినెట్ లో ఆయనకు స్థానం దక్కలేదు. రాజీవ్ గెలుపు తరువాత కూడా ప్రణబ్ ను పక్కనపెట్టేశారు. 

నాలుగు సంవత్సరాల తరువాత రాజీవ్ గాంధీ తిరిగి ప్రణబ్ ముఖర్జీ వైపుగా చూసారు. 1991 వరకు రాజీవ్ గనుక బ్రతికి ఉండి ప్రధాని అయితే..... ఆర్థికమంత్రిగా ప్రణబ్ అయ్యి ఉండే వారు. మన్మోహన్ సింగ్ కాదు.  పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రణబ్ ముఖర్జీ విదేశాంగ మంత్రిగా కొనసాగినప్పటికీ.... లైం లైట్ లో నిలిచిపోయింది మాత్రం మన్మోహన్ సింగ్. 

2004లో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పుడు ప్రణబ్ కాబినెట్ మంత్రి. ఇక్కడొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.... ఇందిరా హయాంలో ప్రణబ్ ఆర్ధిక మంత్రిగా పనిచేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్. అప్పుడు ప్రణబ్ కి రిపోర్ట్ చేసిన మన్మోహన్ కి ఇప్పుడు ప్రణబ్ రిపోర్ట్ చేయవలిసి వచ్చింది. 

యూపీఏ హయం లో ప్రధాని మన్మోహన్ కు ప్రణబ్ కి మధ్య సంబంధాలు కాస్త చెడ్డాయి. అమెరికాతో పౌర అణు ఒప్పందం విషయంలో లెఫ్ట్ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని చెప్పాయి. మన్మోహన్ మాత్రం ప్రభుత్వం కూలిపోతే కూలిపోనివ్వండని మిన్నకున్నాడు. ఆ సమయంలో లెఫ్ట్ మద్దతు ఉపసంహరిస్తే పరిస్థితి కష్టం. 

ప్రణబ్ ముఖర్జీ మాత్రం అప్పుడు లెఫ్ట్ వాదనలోని నిజాయితీని గుర్తించారు. ఎన్నికలకు వెళ్ళేటప్పుడు అణుఒప్పందం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు కదా అనేది ఆయన వాదన. 2009లో కాంగ్రెస్ కి అప్పుడు వచ్చినన్ని సీట్లే వస్తే... మరోసారి లెఫ్ట్ మద్దతు అవసరమైనప్పుడు అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ప్రణబ్ ప్రధాని పదవిని చేపట్టాల్సింది. కానీ కాంగ్రెస్ కి మెజారిటీ రావడంతో మరో మారు ప్రణబ్ ఆశలు అడియాశలయ్యాయి. 

ఇక యూపీఏ 2 హయాంలో ప్రణబ్ ఆర్ధిక మంత్రిగా ఉండగా మన్మోహన్ ప్రధానిగా ఉన్నారు. గతంలో ఆయనకు రిపోర్ట్ చేసిన వ్యక్తికి ఇప్పుడు ప్రణబ్ రిపోర్ట్ చేయాల్సి వచ్చింది. వాస్తవంగా ప్రణబ్ ప్రధాని అయితే... రాష్ట్రపతి మన్మోహన్ అవ్వాల్సింది. కానీ చివరకు ప్రణబ్ రాష్ట్రపతి అయ్యారు. అదికూడా అదే ఫైనాన్స్ రంగం పైన. విధి ఎంత విచిత్రమైనదో కదా..!