న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను విముఖమని దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో  రాశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి  తానైతే అంగీకరించేవాడిని కానని చెప్పారు. 

'మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్' 2012-2017 పేరిట తాజాగా మార్కెట్ లో విడుదలైన ప్రణబ్ పుస్తకంలో తెలంగాణ ఏర్పాటు గురించి  కీలక వ్యాఖ్యలున్నాయి.

తన చేతుల మీదుగా రెండు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందనే విషయాన్ని తాను ఏ మాత్రం ఊహించలేకపోయానని ఆయన ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై రాష్ట్రపతి హోదాలో   ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినా కూడ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారడంపై కూడ ఆయన ఈ పుస్తకంలో రాశాడు.

కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక లోక్ సభ స్థానాలు  లభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ కు సంప్రదాయమైన బలమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాల్లో పార్టీ ఓటమి చెందడం వల్ల అధికారానికి దూరమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి భవన్ కు తాను చేరిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వ వైఖరిలో మార్పులు చోటు చేసుకొన్నాయన్నారు. పార్టీని నడిపించడంలో సోనియా వైఫల్యం వెనుక అప్పటి పరిస్థితులు కారణమయ్యాయన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతోందన్నారు.

బీజేపీ 195 నుండి 200 స్థానాల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తోందని అంచనా వేశానని ఆయన చెప్పారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం పాలు కావడం దాని ప్రభావం ఫలితాలపై పడిందన్నారు.