భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇందాక కాసేపటి కింద మరణించారు. బ్రెయిన్ లోని క్లాట్ ను తొలగించడానికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆనాటి నుండి ఆయన కోమాలోనే కొనసాగుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రతరమవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు. 

ముఖర్జీ మరణంతో కాంగ్రెస్‌లో ఒక శకం ముగిసింది; ఇందిరా గాంధీతో కలిసి క్లోజ్ గా పనిచేసిన కాంగ్రెస్ నాయకులలో ఆయన చివరివారు. స్వతంత్ర అభ్యర్థిగా మిడ్నాపూర్ ఉప ఎన్నికలో గెలిచిన వి.కె.కృష్ణ మీనన్‌కు ఎన్నికల ఏజెంట్‌గా ప్రణబ్  ముఖర్జీ రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది.

ప్రణబ్ లోని స్పార్క్ ను గుర్తించిన ఇందిరా గాంధీ... ఆయనను రాజ్యసభకు తీసుకొచ్చింది. 1966లో కాంగ్రెస్ నుండి విడిపోయి బెంగాల్ లో బంగ్లా కాంగ్రెస్ అనే గ్రూపు నుండి ప్రణబ్ ను తీసుకొచ్చింది ఇందిరా గాంధీ. ఆ తరువాత ఆ గ్రూపు 1970 నాటికి కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. 

పారిశ్రామిక అభివృద్ధి శాఖ జూనియర్ మంత్రిగా ముఖర్జీ 1973 లో ఇందిరా గాంధీ కాబినెట్ లో తొలిసారిగా మంత్రి పదవిని చేపట్టారు. రెండేళ్లలోనే ఆయన రెవెన్యూ, బ్యాంకింగ్ విభాగాలకు స్వతంత్ర మంత్రిగా ఎదిగారు. అప్పటి బొంబాయి స్మగ్లింగ్ అండర్వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ ని ఉక్కుపాదంతో అణిచివేయడంతో ఆయన అప్పట్లో సంచలనం సృష్టించారు. 

1982 లో ఎమర్జెన్సీ తరువాత ఇందిరా గాంధీ ప్రధాని పదవిని చేపట్టిన తరువాత ప్రణబ్ ను ఇందిరా ఆర్ధిక శాఖా మంత్రిగా నియమించింది. వెంకట్ రామన్ ని తొలగించి మరీ ఇందిరా ప్రణబ్ కి ఈ పదవిని కట్టబెట్టింది. 

ఆర్ధిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ దూకుడుగా వ్యవహరించారు. ఐఎంఎఫ్ పంపించిన 1.1 బిలియన్ డాలర్ల రుణంలోని మొదటి విడతను తిప్పి పంపించి ప్రపంచదేశాలను షాక్ కి గురి చేసాడు. ద్రవ్యోల్బణం చేయి దాటకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటూనే ప్రభుత్వ ఖర్చును పెంచాడు. విదేశాల్లో ఉన్న భారతీయుల నుండి నిధులను కూడా సేకరించాడు. 

ఇండియా అమెరికా పౌర అణు ఒప్పందాన్ని కుదర్చడంలో ప్రణబ్ దా పాత్ర కీలకమైనది. ప్రభుత్వం పడిపోతుందనే భయాల మధ్య కూడా చాలా తెలివిగా ఆ ఒప్పందం కుదిరేలా చూసాడు ప్రణబ్ ముఖర్జీ. 

ఆర్ఆర్బీల(ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు) ఏర్పాటు, నాబార్డ్, ఎగ్జిమ్ బ్యాంకు అన్ని కూడా ప్రణబ్ హయాంలో ఏర్పాటయినవే. 5సార్లు రాజ్యసభ సభ్యునిగా రెండు సార్లు లోక్ సభ సభ్యునిగా పనిచేసారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇచ్చి దేశం ఆయనను సత్కరించింది.  

తన తెలివితేటలతో ఎటువంటి సమస్యనయినా చిటికలో పరిష్కరించే ప్రణబ్ దా ట్రబుల్ షూటర్ గా పేరుగాంచాడు.  విదేశాంగ, ఆర్ధిక, రక్షణ శాఖా మంత్రిగా పనిచేసిన ప్రణబ్.. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా పనిచేసారు. 2012 నుంచి 2017 వరకు భారత దేశ 13వ రాష్ట్రపతిగా పనిచేసారు.