గోవాలో రెండో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎంగా మరో సారి ప్రమోద్ సావంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 28వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారు.
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మార్చి 28వ తేదీన రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గత కొన్ని రోజులుగా గోవా సీఎం ఎవరనే విషయం చర్చ జరుగుతోంది. ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత గోవాలో రెండో సారి బీజేపీ అధికారంలోకి వస్తోందని స్పష్టం అయ్యింది. అయితే సీఎం ఎవరనేది మాత్రం ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించలేదు. అయితే సోమవారం బీజేపీ ఈ విషయంలో స్పష్టతనిచ్చింది. ప్రమోద్ సావంత్ రెండో సారి సీఎంగా కొనసాగుతారని ప్రకటించింది. దీంతో ఆయన శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రమోద్ సావంత్ మూడు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీఎం అభ్యర్థిగా ప్రమోద్ సావంత్ కొనసాగుతారని తెలిసిన వెంటనే ఆయన శాసనసభా పక్షనేతగా ఎన్నికయ్యారు. అనంతరం ఇద్దరు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పత్రాలను రాజ్ భవన్ లో బీజేపీ సమర్పించింది.
సోమవారం నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు నరేంద్ర సింగ్ తోమర్, ఎల్ మురుగన్, అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్, గోవా బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే హాజరయ్యారు. సభా నాయకుడిగా డాక్టర్ ప్రమోద్ సావంత్ వ్యవహరించాలని నిర్ణయించినట్లు తోమర్ ఈ సమావేశం అనంతరం ప్రకటించారు.
ఇటీవల జరిగిన గోవా ఎన్నికల్లో బీజేపీ 20 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. అంటే అధికారం చేపట్టేందుకు మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ బీజేపీ 20 మాత్రమే గెలుచుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు ప్రకటన అనంతరం తమకు స్వతంత్ర సభ్యుల మద్దతు లభించిందని బీజేపీ ప్రకటించింది. తరువాత మరో ఇద్దరు MGP ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంది. మొత్తంగా మగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, మరో ఇద్దరి ఎంజీపీ ఎమ్మెల్యేలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాషాయ పార్టీ దావా వేసింది. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వారిలో అలీక్సో రెజినాల్డో లౌరెన్కో , డాక్టర్ చంద్రకాంత్ షెట్యే, ఆంటోనియో వాస్ ఉన్నారు.
రాజ్ భవన్ లో బీజేపీ దావా వేసిన అనంతరం గోవాలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రమోద్ సావంత్ ను గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పైళ్లై ఆహ్వానించారు. ‘‘ డాక్టర్ ప్రమోద్ సావంత్ కు 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నందుకు నేను సంతృప్తి చెందాను. దాని ప్రకారం గోవా ముఖ్యమంత్రిగా నియమితులు కావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు ప్రమాణ స్వీకారం తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.’’ అంటూ గవర్నర్ పేర్కొన్నారు.
గోవా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ 11 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండు, రివల్యూషనరీ గోన్స్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ సారి టీఎంసీ కూడా ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో అధికారం చేపట్టాలని భావించిన కాంగ్రెస్ రెండో సారి కూడా ప్రతిపక్షంలోనే నిలిచిపోయింది.
