కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక కూటమి ప్రయత్నాల్లో భాగంగా నేడు తెలంగాణ సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే‌తో (Uddhav Thackeray) భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) పాల్గొన్నారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక కూటమి ప్రయత్నాల్లో భాగంగా నేడు తెలంగాణ సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే‌తో (Uddhav Thackeray) భేటీ అయ్యారు. ఈ భేటీలో జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. రాష్ట్రాల హక్కుల విషయాల్లో కేంద్రం జోక్యం అడ్డుకట్ట వేసేందుకు ఏం చేయాలనే అంశంపై కూడా వీరిద్దరు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఎన్డీయేతర సీఎంలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా జరుగుతున్న రాజకీయ భేటీ కావడంతో సర్వత్ర ఈ పరిణామాలపై ఆసక్తి నెలకొంది. ఉద్దవ్‌‌తో భేటీ కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బృందం.. ఈ రోజు ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంది. అయితే అక్కడ ఎవరూ ఊహించని అతిథి కనిపించడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆయన ఎవరని అనకుంటున్నారా.. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj). ముంబై చేరుకున్న సీఎం కేసీఆర్ బృందానికి ప్రకాష్ రాజ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్‌కు టీఆర్‌ఎస్ బృందంలోని సభ్యులను కేసీఆర్ పరిచయం చేశారు. అనంతరం కేసీఆర్ బృందంతో పాటే ప్రకాష్ రాజ్ కూడా మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం Varsha bungalow చేరుకున్నారు. అక్కడ కేసీఆర్ బృందంతో పాటే మహారాష్ట్ర సీఎం ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం సీఎంలు నిర్వహించిన ప్రెస్ ‌మీట్‌లో కూడా ప్రకాష్ రాజ్ కనిపించారు.

కేసీఆర్ వెంటే ప్రకాష్ రాజ్..
ఉద్దవ్‌తో భేటీ అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో కూడా కేసీఆర్‌తో పాటే ప్రకాష్ రాజ్ కనిపించారు. సీఎం ఉద్దవ్‌, శివసేన కీలక నేత సంజయ్ రౌత్‌లు.. కేసీఆర్‌‌ కారు వద్దకు వచ్చి వీడ్కొలు పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ బయలుదేరిన కారులోనే ప్రకాష్ రాజ్‌ కూడా ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్‌ కారులో కూర్చొన్న తర్వాత సంజయ్‌ రౌత్ ఆయనతో ఏదో విషయం మాట్లాడటం కనిపించింది. ఈ పరిణామాలు గమనిస్తే బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో తన వంతు సాయం అందిస్తాడని రాజకీయా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీపై ఆయనకున్న వ్యతిరేకత ఈ భేటీలో కేసీఆర్ వెంట నడిచేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది. అయితే శివసేన, ప్రకాష్ రాజ్ మధ్య ఏవిధమైన రిలేషన్ ఉందనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. 

టీఆర్‌ఎస్‌తో సన్నిహిత సంబంధాలు..
అక్కడ కేసీఆర్, ఉద్దవ్‌ల భేటీ సందర్భంగా ప్రకాష్ రాజ్ కనిపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ మొదటి నుంచి బీజేపీ, ప్రధాన మంత్రి మోదీ వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీఆర్‌ఎస్‌తో మాత్రం ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని చెబుతారు. కరోనా కాలంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ప్రకాష్ రాజ్ ప్రశంసించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ఇచ్చే భరోసా అందరిలో ధైర్యం నింపుతోందన్నారు. కేసీఆర్ వ్యక్తిత్వం గొప్పదని.. ఆయన మనసు బంగారమని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. 

గతంలో దేవేగౌడతో భేటీ సమయంలో.. 
గతంలో విపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేసిన సమయంలో.. మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవేగౌడతో భేటీ అయ్యారు. ఆ సమయంలో కేసీఆర్ టీమ్‌తో ప్రకాష్ రాజు కూడా ఉన్నారు. దక్షిణాది చిత్రాల్లో ఫేమస్ నటుడైన ప్రకాష్ రాజ్.. ఆ భేటీలో పాల్గొనడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ వ్యతిరేకుడిగా ఉన్న ప్రకాష్ రాజ్.. కన్నడ రాజకీయ నేతలతో మంచి పరిచయం ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్, దేవేగౌడల భేటీ వెనక ప్రకాష్ రాజ్ ముఖ్య భూమిక పోషించారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆగిపోయాయి.

Scroll to load tweet…

కొన్ని నెలలుగా బీజేపీపై కేసీఆర్ నిప్పులు..
ఇక, కొన్ని నెలలుగా కేంద్రంలోని బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరుగుతున్న కేసీఆర్.. రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుందని ఆరోపించారు. దేశం కోసం అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాడి బీజేపీని గద్దె దించుతామని కూడా కేసీఆర్ తెిలపారు. ఈ క్రమంలోనే కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ‌లో కలిసి కేంద్రంలో బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్.. నేడు ముంబై వెళ్లి ఉద్దవ్ ఠాక్రే‌తో భేటీ అయ్యారు. 

కేసీఆర్‌ వెంట ఎంపీలు సంతోష్‌, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. అయితే వీరితోనే పాటు ప్రకాష్ రాజు కూడా మహారాష్ట్ర సీఎంను కలిశారు. దీంతో బీజేపీ వ్యతిరేక పోరులో ముందుంటానని ప్రకాష్ రాజ్ మరోసారి స్పష్టం చేసినట్టు అయింది. బీజేపీకి వ్యతిరేక కూటమి ఏర్పాటులో మరోసారి కేసీఆర్ మద్దతుగా ప్రకాశ్ రాజ్ ఉండనున్నారనే ప్రచారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.

ఎన్నికల్లో ఓడిన ప్రకాష్ రాజ్..
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బరిలో నిలిచిన ప్రకాష్ రాజ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి నిలిచిన ప్రకాశ్ రాజ్ బీజేపీ అభ్యర్థి మోహన్ చేతిలో ఓడిపోయారు. కానీ రాజకీయాలు, సమాజ సేవపైనే ఆయనకు ఆసక్తి ఎక్కువనే ఆయన చర్యల ద్వారా తెలుస్తోంది. 

ప్రకాష్ రాజ్‌పై బీజేపీ విమర్శలు..
బీజేపీ, ప్రధాని మోదీ విధానాలను వ్యతిరేకించే ప్రకాష్ రాజ్.. #justasking పేరుతో సోషల్ మీడియాలో రాజకీయాలపై, సమాజంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రశ్నలు సంధిస్తుంటారు. అయితే ఆయన బీజేపీకి వ్యతిరేక వాయిస్ వినిపించడంతో.. బీజేపీ నేతలు ఆయనపై ఎదురుదాడికి దిగుతుంటారు. ఇక, తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉన్న ప్రకాష్.. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి చెందారు. అయితే ప్రకాష్ రాజ్‌ ఓటమిని ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగిందని ట్వీట్ చేశారు. అయితే ఈ పరిణామాలు ప్రకాష్ రాజ్‌కు బీజేపీపై మరింత కోపం తెప్పించాయనే చెప్పాలి.