హీరో సిద్దార్థకు సారీ చెప్పిన ప్రకాశ్ రాజ్.. అసలేం జరిగింది ?
నటుడు సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సినిమా ‘చిత్తా’ ప్రమోషన్ ను రాజకీయ వర్గం అడ్డుకోవడం, నటుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడం దురద్రుష్టకరమని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ప్రకాశ్ రాజ్ తన సహోద్యోగికి సంఘీభావం తెలిపేందుకు ముందుకు వచ్చాడు.

నటుడు సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సినిమా ‘చిత్తా’ ప్రమోషన్ లో భాగంగా గురువారం బెంగళూరులోని మల్లేశ్వరలోని ఎస్‌ఆర్‌విలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో సిద్ధార్థ్ తన సినిమా గురించి అక్కడి వారితో మాట్లాడుతున్నారు. ఇంతలో సడెన్ గా కర్ణాటక రక్షణ వేదిక సభ్యులు కార్యక్రమంలోకి దూసుకవచ్చారు. ఆ మీట్ ను అడ్డుకున్నారు.
కావేరి నదీ జలాలు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఒక తమిళ చిత్రానికి ప్రచారం చేయడం సరికాదని, హీరో సిద్దార్థని అక్కడి నుంచి వెళ్లిపోయాలని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమిళ సినిమాలను ఎవరూ ప్రోత్సహించవద్దని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కావేరి నదీ జలా వివాదం నడుస్తుందని, ఈ సమయంలో కర్ణాటకలో తమిళ సినిమా గురించి ప్రచారం చేయడానికి ఇది సరైన సమయం కాదని, మళ్లీ ఎప్పుడైనా చేయండి కానీ ఇప్పుడు కాదని, ఈ అంశం చాలా సున్నితమైందని, ఈ కార్యక్రమాన్ని వెంటనే ముగించాలని అన్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ కూడా వెంటనే లేచి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా హీరో సిద్దార్థకు సారీ చెపుతూ..ట్విట్ చేశారు. " దశాబ్దాల నాటి ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైనందుకు అన్ని రాజకీయ పార్టీలను,నాయకులను ప్రశ్నించకుండా.. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒత్తిడి చేయని పార్లమెంటేరియన్లు ప్రశ్నించకుండా.. సామాన్యులను, కళాకారులను ఇలా ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. కన్నడిగుడిగా.. కన్నడిగుల పక్షాన సిద్దార్థ క్షమించండి " అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుత్ం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
వాస్తవానికి కావేరీ నదీ జలా వివాదం చాలా కాలంగా కొనసాగుతుంది. ఈ తరుణంలో కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. నీటి పంపకాలపై సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయని ఇరు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఈ వివాదం మళ్లీ తెర మీదికి వచ్చింది. ఇటీవల కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు పెరిగాయి.