న్యూఢిల్లీ:  2019 సివిల్స్ పరీక్ష ఫలితాలను యూపీఎస్‌సీ మంగళవారం నాడు విడుదల చేసింది. సివిల్స్ పరీక్షల్లో ప్రదీప్ సింగ్ మొదటి ర్యాంకు సాధించాడు. మహిళల్లో ప్రతిభా వర్మ తొలి స్థానాన్ని దక్కించుకొంది.ఈ ఫలితాల్లో తెలంగాణ యువకుడు మంద మకరంద్ సత్తా చాటాడు. ఆలిండియాలో ఆయనకు 110 ర్యాంక్ దక్కింది.

మకరంద్  తల్లిదండ్రుు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం ఈ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది.2019 సివిల్ సర్వీసెస్ కు 829 మంది ఎంపికయ్యారు. ఫైనల్ రిజల్ట్స్ ను వెబ్ సైట్ లో ఉంచినట్టుగా యూపీఎస్‌సీ ప్రకటించింది.

2019 సెప్టెంబర్ లో రాతపరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా సివిల్ సర్వీసెస్ కు 829 మందిని ఎంపిక  చేశారు.  2019లో తొలిసారిగా ఈడబ్ల్యుఎస్ కోటాను అమలు చేశారు.  ఈడబ్ల్యుఎస్ కోటాను పొందిన వారిలో 78 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు.11 మంది అభ్యర్ధుల ఫలితాన్ని నిలిపివేశారు. 

ప్రతి ఏటా పరీక్షల ద్వారా ఐఎఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ కు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్షలను మే 31వ తేదీన నిర్వహించాలి. కానీ కరోనా కారణంగా ఈ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు.
 

తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన మకరంద్ సివిల్స్ లో 110 ర్యాంకు సాధించడం పట్ల మంత్రి హరీష్ రావు అభినందించారు. తెలంగాణ ఖ్యాతిని చాటారని మంత్రి ఆయనను ప్రశంసించారు.