Asianet News TeluguAsianet News Telugu

అంధకారంలో పుదుచ్చేరి.. విద్యుత్‌ కోతలతో రోడ్లపైకి వచ్చిన జనం.. ప్రభుత్వంపై ఆగ్రహం..

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అంధకారంలోకి వెళ్లిపోయింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో..  శనివారం సాయంత్రం పుదుచ్చేరిలో పెద్దఎత్తున విద్యుత్‌ అంతరాయంతో గంటల తరబడి అంధకారంలో మునిగిపోయింది. విద్యుత్‌ కోతలతో ప్రజలు నిరసన బాట పట్టారు. రోడ్లపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Power cuts in puducherry leads to road blockades
Author
First Published Oct 2, 2022, 10:20 AM IST

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అంధకారంలోకి వెళ్లిపోయింది. చాలా చోట్ల విద్యుత్‌ కోతలతో ప్రజలు నిరసన బాట పట్టారు. వివరాలు.. విద్యుత్ పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా పుదుచ్చేరిలో విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా వారు సమ్మెలో ఉన్నారు. దీంతో పుదుచ్చేరిలో విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. తొలి రెండు రోజులు పెద్దగా విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ.. శుక్రవారం నుంచి విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. శనివారం సాయంత్రం పుదుచ్చేరిలో పెద్దఎత్తున విద్యుత్‌ అంతరాయంతో గంటల తరబడి అంధకారంలో మునిగిపోయింది. అయితే పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం విద్యుత్ కోతలను ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఈ పరిస్థితులు అక్కడి ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. 

పెద్ద ఎత్తున విద్యుత్తు అంతరాయాలపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత వీధుల్లోకి వచ్చిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాజా థియేటర్, ముదలియార్‌పేట్, ఈసీ‌ఆర్తో సహా నగరంలోని వివిధ ప్రాంతాలలో, అనేక సబర్బన్ ప్రాంతాలలో రహదారులను దిగ్భంధించారు. టార్చ్ లైట్లు, కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు జి నెహ్రూ, ప్రకాష్‌కుమార్‌ నేతృత్వంలోని ఒక వర్గం కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సంక్షోభానికి పరిష్కారం చూపడంలో నాయకత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రధాన సచివాలయం ఎదుట ధర్నాకు దిగింది.

మరోవైపు సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు విద్యుత్‌ శాఖ మంత్రి నమశ్శివాయం.. విద్యుత్‌, పోలీసు శాఖల ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటలకల్లా కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు యంత్రాంగం సఫలమైంది.

Power cuts in puducherry leads to road blockades

విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 25 మంది సభ్యుల బృందం పుదుచ్చేరి అంతటా విద్యుత్ సరఫరాను పునరుద్దరించడంలో చేయడంలో సహాయం చేస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. పరిస్థితిని అధిగమించడానికి పరిపాలన కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించినట్టుగా పేర్కొన్నాయి. కీలకమైన సబ్ స్టేషన్ల పరిధిలో పోలీసు భద్రతను పెంచుతున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక, పండుగల సీజన్‌ సమీపిస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

ఇదిలావుండగా.. విద్యుత్ ఉద్యోగుల సమ్మె, నిరంతర విద్యుత్ కోతల కారణంగా సమైక్య రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితులపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే కన్వీనర్, ప్రతిపక్ష నేత ఆర్ శివ ముఖ్యమంత్రి ఎన్ రంగసామిని కోరారు. విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకోగా.. రూ. 100 కోట్లకు పైగా నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారని శివ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios