Asianet News TeluguAsianet News Telugu

విషాదం : ఛాయ్ అమ్ముకుంటున్న కరాటే ప్రపంచ ఛాంపియన్.. !


పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన హరిఓమ్ శుక్తా.. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. 

Poverty forces world karate champion to sell tea - bsb
Author
hyderabad, First Published Jun 15, 2021, 4:58 PM IST

పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన హరిఓమ్ శుక్తా.. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. పదునైన పంచ్ లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డెక్కాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని దీన స్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు. 

2013లో థాయ్ లాండ్ లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించిన శుక్లా.. ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు.

అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీలో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. 

రోజురోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్ ను నడిపిస్తున్నాడు. లాక్ డౌన్ ముందు వరకు స్కూలు పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్ వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నానని అతను వాపోతున్నాడు. 

ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని, ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios