Asianet News TeluguAsianet News Telugu

రోడ్డుపై గుంతల కారణంగా ప్రాణాలు కోల్పోయిన మహిళా టెక్కీ.. అసలేం జరిగిందంటే..

రోడ్డుపై ఉన్న గుంతలు ఓ 22 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాన్ని బలికొన్నాయి. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా బాధిత టెక్కీ బైక్ మీద నుంచి కిందపడిపోగా.. ఆమెపై నుంచి లారీ దూసుకెళ్లింది. 

Potholed road kills 22 year old techie Shobana in tamil nadu
Author
First Published Jan 4, 2023, 11:24 AM IST

రోడ్డుపై ఉన్న గుంతలు ఓ 22 ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాన్ని బలికొన్నాయి. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా బాధిత టెక్కీ బైక్ మీద నుంచి కిందపడిపోగా.. ఆమెపై నుంచి లారీ దూసుకెళ్లింది. అయితే తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరం-మదురవాయల్ బైపాస్ రోడ్డులో మధురవాయల్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. బాధితురాలు శోభన జోహో అనే ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. శోభన 12వ తరగతి చదువుతున్న తన తమ్ముడిని మొగప్పైర్‌లోని పాఠశాలకు తీసుకెళ్లేందుకు మంగళవారం ఉదయం స్కూటీపై బయలుదేరింది. 

అయితే  వారిద్దరు వెళ్తున్న బైక్‌.. రోడ్డుపై ఉన్న గుంతల కారణంగా అదుపుతప్పింది. దీంతో బైక్‌తో పాటు వారిద్దరు కూడా కిందపడిపోయారు. అయితే శోభనపైకి ఆ మార్గంలో వెళ్తున్న లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి శోభన తమ్ముడు బతికి బయటపడ్డాడు. అయితే అతనికి గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పూనమల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శోభన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం పోరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ట్విట్టర్‌ వేదికగా రోడ్ల దుస్థితిని ప్రశ్నించారు. శోభన మృతి ఆమె కుటుంబానికి, తమ కంపెనీకి నష్టంగా పేర్కొన్నారు. ‘‘మా ఇంజనీర్లలో ఒకరైన మా శోభన చెన్నైలోని మధురవాయల్ సమీపంలో గుంతలు పడిన రోడ్లపై స్కూటర్ అదుపుతప్పి కిందపడి మరణించింది. అప్పుడు ఆమె తన తమ్ముడిని పాఠశాలకు తీసుకువెళుతోంది. మన అధ్వాన్నమైన రోడ్లు ఆమె కుటుంబానికి, జోహోకి విషాదకరమైన నష్టాన్ని కలిగించాయి’’ అని శ్రీధర్ వెంబు ట్వీట్ చేశారు. 

 


ఇక, ఈ ఘటన జరిగిన వెంటనే.. ఆ మార్గంలో రోడ్డు దుస్థితిపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు ఇసుక, కంకర తెప్పించి గుంతలను పూడ్చివేశారు. అయితే రోడ్డుపై తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios