పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఆరు రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను దళిత సామాజిక వర్గానికి ప్రతినిధి అని పేర్కొంటూ.. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ వారు పెద్ద సంఖ్యలో గురు రవిదాస్ జీ జయంతి సందర్భంగా యూపీలోని బెనారస్‌కు పర్యటిస్తారని వివరించారు. తమ పర్యటనకు అనుకూలంగా అసెంబ్లీ ఎన్నికల తేదీలను సవరిస్తే.. తమ ఓటు హక్కునూ వినియోగించుకోగలమని వారు తనను కోరినట్టు తెలిపారు.  

చండీగడ్: ఎన్నికల వేడి మొదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం మొదలు పెట్టాయి. ప్రచారాలూ షురూ అయ్యాయి. ప్రత్యక్ష ర్యాలీలపై నిషేధం విధించడంతో వర్చువల్‌గానే ఓటర్లను అభ్యర్థులు ఆకర్షిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Assembly Election) షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్(CEC Shushil Chandra) చంద్ర ప్రకటించారు. తాజాగా, తమ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ వాయిదా(Postpone) వేయాలని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ(Punjab CM charanjit singh channi) ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్రకు లేఖ రాశారు.

పంజాబ్‌లో 32 శాతం మంది ప్రజలు ఎస్సీ కమ్యూనిటీ వారే. ఈ నెల 16వ తేదీ గురు రవిదాస్ జీ జయంతి ఉన్నది. ఈ జయంతి సందర్భంగా ఎస్సీ కమ్యూనిటీ వారు... సుమారు 20 లక్షల మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌కు పర్యటిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో వీరంతా బెనారస్‌కు పర్యటిస్తారని సీఎం తన లేఖలో వివరించారు. ఈ పర్యటన కారణంగా ఎస్సీ కమ్యూనిటీలోని చాలా మంది తమ రాజ్యాంగ హక్కు అయిన ఓటు హక్కును వినియోగించుకోలేక పోవచ్చునని పేర్కొన్నారు. అందుకే వారు ఈ అసెంబ్లీ ఎన్నికల తేదీని మరో ఆరు రోజులు వాయిదా వేయాల్సిందిగా కోరారని వివరించారు. అలా చేస్తే.. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వారు బెనారస్ పర్యటనకు వెళ్లి వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కారణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తద్వార 20 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని వివరించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వచ్చే నెల 14వ తేదీన జరగనున్నాయి. సింగిల్ ఫేజ్‌లో ఈ ఎన్నికలు ముగుస్తాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వస్తాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శనివారం 86 మందితో తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ చాంకౌర్ సాహిబ్ నుంచి పోటీ చేయనున్నారు. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దూ.. తూర్పు అమృత్‌సర్ నుంచి పోటీ చేస్తారు. డేరా బాబా నానక్ నియోజవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంథావా, గిడ్డెర్‌బహ నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజా అమరీందర్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. ప్రముఖ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌ మోగా నియోజకవర్గం నుంచి బ‌రిలోకి దించుతోంది కాంగ్రెస్‌. 

దేశంలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో Road show, బహిరంగ సభలపై నిషేదాన్ని ఈ నెల 22 వ తేదీ వరకు ఎన్నికల సంఘం పొడిగించింది. దేశ వ్యాప్తంగా Corona కేసులు పెరిగిపోతున్నందున Election commission ఈ నిర్ణయం తీసుకొంది. Goa, Manipur Uttarakhand Punjab, Uttar Pradesh రాష్ట్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వ తేదీ వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలను పురస్కరించుకొని రాజకీయ పార్టీలకు ఈసీ కొన్ని మినహాయింపులను అందించింది.