దేశంలో కరోనా కారణంగా పరిస్ధితులు నానాటికి దిగజారిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఓటు వేయాలంటే ఎవరైనా సరే పోలింగ్ బూతుకు రావాల్సిందే.

కానీ పరిస్ధితుల దృష్ట్యా 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం  కల్పించింది. అంతేకాకుండా కోవిడ్ బాధితులు, సెల్ఫ్ ఐసోలేషన్‌లో వున్నవారికి సైతం ఈ అవకాశాన్ని కల్పించింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది చివరిలో బీహార్ సహా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 కాలంలో ఓటర్లు పెద్ద ఎత్తున లైన్‌లో నిలుచోవడం వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.

ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించే పరిపాలనా సిబ్బంది, పోలీసులు, విదేశాల్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరికొంతమంది సిబ్బందికి కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే వెసులుబాటు వుంది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో 65 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వుంది.