జనాభా నియంత్రణపై సంఘ్ నాయకుడు దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ... చొరబాటు వల్ల జనాభా అసమతుల్యత ఏర్పడుతోందని   అన్నారు.  హిందూ సమాజంలో వివిధ కార్యక్రమాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై కూడా సమావేశంలో చర్చించినట్లు దత్తాత్రేయ హోసబాలే తెలిపారు.

జనాభా నియంత్రణపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ నేత సర్కార్యవా దత్తాత్రేయ హోసబాలే సంచలన ప్రకటన చేశారు. బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో జనాభా విస్ఫోటనం ఆందోళన కలిగించే విషయమన్నారు. కాబట్టి ఈ విషయంపై మనమందరం కలిసి ఆలోచించాలనీ, దేశంలో అందరికీ వర్తించేలా జనాభా విధానాన్ని రూపొందించాలన్నారు. 

ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగు రోజుల అఖిల భారత కార్యనిర్వాహక మండలి సమావేశం చివరి రోజున దత్తాత్రేయ హోసబాలే విలేకరులతో మాట్లాడుతూ.. దువులలో జరుగుతున్న మత మార్పిడి కారణంగా వారి సంఖ్య వేగంగా తగ్గిపోతోందనీ,దేశంలోని అనేక ప్రాంతాల్లో హిందువులను మతం మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఇది కాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో చొరబాటు కేసులు కూడా వస్తున్నాయి. జనాభా అసమతుల్యత కారణంగా చాలా దేశాల్లో విభజన జరిగిందని అన్నారు. జనాభా అసమతుల్యత కారణంగా భారతదేశ విభజన కూడా జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల గిరిజన సమాజంలో ఆత్మగౌరవం మెలగడం వల్ల తాను హిందువును అనే భావన కూడా అభివృద్ధి చెందిందని అన్నారు. అంతే కాకుండా “ఘర్ వాప్సీ” మంచి ఫలితాలు సాధించిందని పేర్కోన్నారు. 

ఆత్మగౌరవం మేల్కొనడం వల్లే.. ఈశాన్య రాష్ట్రాల గిరిజన సమాజానికి చెందిన ప్రజలు కూడా సంఘ్‌లో చేరాలనుకుంటున్నారని అన్నారు. మేఘాలయ, త్రిపుర రాష్ట్రంలోని గిరిజన సంఘం ప్రజలు కూడా ఈ సెంటిమెంట్‌తో సంఘ్‌కు చెందిన సర్సంఘచాలక్‌ను తమ స్థానానికి ఆహ్వానించడం ప్రారంభించారని ఆయన చెప్పారు.సంఘ్ స్థాపించిన వందేళ్ల సంవత్సరంలో అనేక అంశాలపై వేగంగా పనిచేస్తుందన్నారు. కరోనా కష్ట సమయాల్లో కూడా సంఘ్ తన పనిని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. 

అంతకుముందు, అక్టోబర్ 16 నుండి 19 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సంఘ్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు. 2025లో సంఘం శతాబ్ది ఉత్సవాలను జరుపుకోబోతున్నట్లు హోస్బాలె తెలిపారు. ఇందుకోసం 2024 చివరి నాటికి దేశంలోని అన్ని డివిజన్లలో సంఘ్ శాఖకు చేరువయ్యేలా ప్రణాళిక రూపొందించారు. 2010-11లో ప్రారంభించిన ' జాయిన్ ఆర్‌ఎస్‌ఎస్ ' వేదిక కింద స్వచ్ఛందంగా 1,30,000 మంది చేరారని ఆయన చెప్పారు.