ప్రముఖ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి...
నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించినట్లు శుక్రవారం ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : నటి పూనమ్ పాండే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో మరణించినట్లు ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా శుక్రవారం షేర్ చేసింది. అందులో ఇలా రాశారు.. "ఈ ఉదయం చాలా దురదృష్టకరమైనది. మా ప్రియమైన పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో కోల్పోయాం. ఈ విషయం మీకు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం. ఆమెతో పరిచయం ఉన్న ప్రతీ వ్యక్తికి, జీవికి ఆమె స్వచ్ఛమైన ప్రేమ, దయ గురించి తెలుసే ఉంటుంది. ఈ వార్త చాలా దు:ఖ సమయం. మమ్మల్ని కాస్త ఒంటరిగా వదిలేయమని కోరుకుంటున్నాం" అని తెలిపారు.
మోడల్-నటి, ఇంటర్నెట్ సంచలనం, అత్యంత వివాదాస్పద తారలలో ఒకరైన పూనమ్ పాండే క్యాన్సర్ కారణంగా మరణించడం అందరికీ షాక్ కు గురి చేసింది. ఆమె మరణవార్త మోడలింగ్, చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. అయితే, ఇది ఆమె చేసిన పబ్లిసిటీ స్టంట్ అని కొందరు సోషల్ మీడియా వినియోగదారులు కూడా పేర్కొంటున్నారు. ఆమె వైరల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు వివాదాస్పద చర్యలకు ప్రసిద్ధి చెందింది.
అయితే, పూనమ్ పాండే మరణ వార్తను ఆమె పీఆర్ బృందం ధృవీకరించింది. కాగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో, నెటిజన్లు దీనిపై స్పందించడం ప్రారంభించారు. ఒకరు.. ''ప్రభుత్వం ముందుకు తెస్తున్న టీకాల కోసం మార్కెటింగ్ జిమ్మిక్కు కావచ్చు' అంటే.. మరొకరు ''ఇది మార్కెటింగ్ జిమ్మిక్కు అయితే.. చాలా అసహ్యకరమైనది. కానీ, అది నిజమైతే...ఆమె ఆత్మకు శాంతి కలగాలి’ అని వ్యాఖ్యానించారు.