కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల కోసం ఓ బ్లూ ప్రింట్‌ను అందించారు. ప్రస్తుత దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రాధాన్యత, దాని స్థితి గురించి వివరించి ఐదు కీలక సూచనలు చేశారు.
న్యూఢిల్లీ: 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో క్రమంగా దిగజారిపోతూనే ఉన్నది. 2019లోనూ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. రాష్ట్రాల్లోనూ బలాన్ని కోల్పోతున్నది. ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లోనే సొంతంగా అధికారంలో ఉన్నది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌ను కూడా కోల్పోయిన విషయం విధితమే. ఉత్తరప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల టెన్షన్ పుట్టుకుంది. దీంతో ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపుల జోరు పెంచింది. ఈ
నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్త పీకే.. కాంగ్రెస్‌కు కీలక సూచనలు ఇచ్చారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మరికొందరు సీనియర్ నేతలకు ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల కోసం ఆచరించాల్సిన బ్లూ ప్రింట్‌ను ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర, దాని స్థితి గురించి వివరించారు. ఈ బ్లూ ప్రింట్ ప్రకటించడానికి ముందు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో మరణించడానికి వీల్లేదని, దేశంతోపాటు అదీ ఉండాలని పేర్కొన్నారు.
ప్రశాంత్ కిశోర్ తన బ్లూ ప్రింట్‌లో దేశ జనాభా, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, రైతుల పట్ల పార్టీ వైఖరిని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, 2024 జనరల్ ఎలక్షన్స్‌లో ఓటు వేయడానికి సిద్ధం అవుతున్న 13 కోట్ల తొలిసారి ఓటేసి నవయువకులనూ ఫోకస్ చేశారు.
కాంగ్రెస్‌కు ప్రస్తుతం లోక్‌సభ, రా జ్యసభలో కలిపి కేవలం 90 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 800 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదని, మరో మూడు రాష్ట్రాల్లో పొత్తులతో అధికారంలో ఉన్నదని తెలిపారు. 13 రాష్ట్రాల్లో ఇది కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నదని పేర్కొన్నారు. 1984 నుంచి కాంగ్రెస్ ఓటు శాతం క్రమంగా క్షీణిస్తూ వస్తున్నదని వివరించారు.
కాంగ్రెస్ అధినాయకత్వానికి ఆయన చేసిన సూచనల్లో ఐదు కీలకమైనవి ఇలా ఉన్నాయి.
1. కాంగ్రెస్ దాని నాయకత్వ సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలి
2. మిత్రపక్షాలు, కూటములకు సంబంధించిన విషయాలనూ సాల్వ్ చేసుకోవాలి
3. పార్టీ దాని పూర్వ ఆదర్శాలను వెనక్కి తెచ్చుకొని మళ్లీ ఆచరించాలి
4. క్షేత్రస్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ తన వర్కర్లు, నేతలను ఏకం చేసి ఎన్నికలకు సన్నద్ధం చేయాలి
5. పార్టీ దాని కమ్యూనికేషన్ సిస్టమ్‌ను ప్రక్షాళన చేసుకోవాలి.
