Arvind Kejriwal: పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హ‌త్య నేప‌థ్యంలో ప్రతిప‌క్ష పార్టీలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. హ‌త్య‌కు కార‌ణం ఆప్ అని ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కేజ్రీవాల్ ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌ని అన్నారు. 

Sidhu Moose Walas-Arvind Kejriwal: పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య దురదృష్టకరమని, అయితే దాని చుట్టూ రాజకీయాలు చేయవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూస్ వాలాను ఆదివారం గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. రాష్ట్ర ప్రభుత్వం అతని భద్రతను ఉప‌సంహ‌రించుకున్న ఒక రోజు త‌ర్వాత ఈ ఘట‌న జ‌రిగింది. పంజాబ్‌లో ఎలాంటి సంఘటనలు జరిగినా వాటి చుట్టూ రాజకీయాలు ఉండకూడదని తాను న‌మ్ముతున్నాన‌ని కేజ్రీవాల్ అన్నారు. సిద్ధూ మూస్ వాలా హత్యకు గురికావడం నిజంగా దురదృష్టకరమ‌ని పేర్కొన్నారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఎస్‌టీపీని సందర్శించిన సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. "పంజాబ్ ముఖ్య‌మంత్రి  భ‌గ‌వంత్ మాన్ సింగ్ ఇప్పటికే తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు మరియు నిందితులను త్వరలో అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు" అని కేజ్రీవాల్ అన్నారు.

కాగా, పంజాబ్ (punjab) అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో (congress) చేరిన ప్రముఖ పంజాబీ గాయకుడు, రాపర్ సిద్ధూ మూస్ వాలాను (Sidhu Moosewala ) గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. జీపులో వెళ్తుండగా ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో సిద్ధూతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలోని వీఐపీలకు పంజాబ్ ప్రభుత్వం (punjab govt) భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం కలకలం రేపింది. ఈ త‌ర్వాత ఈ ఘ‌ట‌న రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. పంజాబీ రాపర్ సిద్ధూ మూస్ వాలా హ‌త్య నేప‌థ్యంలో ప్రతిప‌క్ష పార్టీలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. హ‌త్య‌కు కార‌ణం ఆప్ అని ఆరోపిస్తున్నాయి. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సిద్ధూ మూస్ వాలా హత్యకు బాధ్యత వహించాడు.

సిద్ధూ మూస్ వాలా హత్య కేసును కోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం అభ్యర్థించారు. ఈ కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేస్తూ సిద్ధూ మూస్ వాలా తండ్రి బాల్కౌర్ సింగ్.. సీఎంకు లేఖ రాసిన తర్వాత ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. గ్యాంగ్ వార్ ఘటనకు సంబంధించి పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) క్షమాపణలు చెప్పాలని, భద్రత ఉపసంహరణకు సంబంధించిన ఉత్తర్వులను బహిరంగపరిచిన అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. "పంజాబ్ ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయవలసిందిగా అభ్యర్థిస్తుంది" అని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. అలాగే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వంటి ఏదైనా కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర ప్ర‌భుత్వ ఏజెన్సీల నుంచి విచారణ కమిషన్‌కు పూర్తి సహకారాన్ని కూడా  అందిస్తామ‌ని భ‌గ‌వంత్ మాన్ హామీ ఇచ్చారు.