సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ.. సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలతో సంస్థ ఉద్యోగుల గాఢ సంబంధాలను తెంచుకోవాలని, వెంటనే ప్రజల్లో దానిపై విశ్వసనీయతను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. రాజకీయ నేతలు వస్తుంటారు.. పోతుంటారు.. అని పేర్కొంటూ కానీ, మీరు పర్మినెంట్ అని అన్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈ రోజు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ సంస్థ ఇటీవలి కాలంలో దాని చర్యలు, ఉదాసీనతల కారణంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్నదని, దాని విశ్వసనీయతపైనా అనేక ప్రశ్నలు వస్తున్నాయని అన్నారు. సీబీఐ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సీబీఐ ముందు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమంటే.. అది సోసైటీలో దానిపై గౌరవాన్ని, నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడమేనని వివరించారు. దానికి మొదటి అడుగుగా రాజకీయ నేతలతో సంస్థ సభ్యుల మధ్య వ్యవహారాలను ముగించాలని సూచించారు.

అంతేకాదు, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు అన్నింటిని ఒక అటానమస్ సంస్థ ఏర్పాటు చేసి దాని కిందకు తేవాలని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ప్రతి సంస్థకు ఒక అటానమస్ పర్సన్ నేతృత్వం వహించడం మంచిదని తెలిపారు. డెమోక్రసీ: రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్‌ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. సీజేఐ రమణ తన ప్రసంగంలో దేశంలో పోలీసు వ్యవస్థ ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఏకరువు పెట్టారు. బ్రిటీష్ కాలం నుంచి దానిలో వచ్చిన ప్రధాన మార్పులను ఆయన వివరించారు. ఇప్పుడు సీబీఐ అత్యధికంగా ప్రజల దృష్టిలోకి వచ్చిందని, అందరూ సీబీఐని పరీక్షిస్తుంటారని చెప్పారు.

అవినీతి, ఇతర ఆరోపణలతో పోలీసుల ప్రతిష్ట కొంత మసకబారిందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. చాలా మంది పోలీసులు అధికారం మారగానే తమపై వేధింపులు మొదలు అవుతున్నాయని తమను ఆశ్రయించి చెబుతుంటారని వివరించారు. రాజకీయ నేతలు మారుతుంటారు గానీ, మీరు పర్మినెంట్ అంటూ ఆయన ఈ సందర్భంగా అన్నారు. 

పోలీసుల కంటే కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఎక్కువగా వేధింపులకు గురి కావాల్సి వస్తున్నాయని ఆయన అంగీకరించారు. పోలీసు వ్యవస్థ రాజ్యాంగం నుంచి దాని చట్టబద్ధతను సులువగా సంపాదించుకుంటుందని వివరించారు. కానీ, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకు ఒక చట్టం ఆధారంగా నడుచుకునే ఒక వ్యవస్థ లేదని పేర్కొన్నారు. అంతేకాదు, వారికి మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, అధునాతన సాంకేతిక పరికరాలు, ఆధారాలు సేకరించే పద్ధతులకు సంబంధించిన సవాళ్లు ఎదుర్కొంటుంటారని వివరించారు. అధికారంలో నేతలు మారినప్పడులా వారి ప్రాధాన్యతలూ మారిపోతుంటాయని అన్నారు. తరుచూ ఆ అధికారులు బదిలీలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు.

వీటి కారణంగా దోషులు తప్పించుకుని స్వేచ్ఛగా తిరిగే అవకాశం పొందడమే కాదు.. నిర్దోషులు ఏళ్ల తరబడి ఊచల వెనక
మగ్గాల్సి రావొచ్చు అని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. కానీ, కోర్టులు ప్రతి అడుగును పర్యవేక్షించడం సాధ్యం కాదు కదా అని
వివరించారు. కానీ, ఏ సంస్థ అయిన దానికి నాయకత్వం వహించే వ్యక్తి ఆధారంగా నడుచుకుంటుందని, పిరికెడు మంది
అధికారులు కూడా గణనీయమైన మార్పును తేవచ్చునని చెప్పారు.