కాంగ్రెస్ సర్కార్ కూల్చేందుకు దున్నపోతులు బలిచ్చి క్షుద్రపూజలు..: డిప్యూటీ సీఎం సంచలనం
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు డికె. శివకుమార్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇందుకోసం రాజకీయ ప్రత్యర్థులు క్షుద్రపూజలు చేస్తున్నారని శివకుమార్ ఆరోపించారు...
బెంగళూరు : కేవలం రాజకీయా వ్యూహాలతోనే కాదు క్షుద్రపూజలతోనూ ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు జరుగుతాయా? అంటే కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డికె. శివకుమార్ అవుననే అంటున్నాడు. ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు క్షుద్రపూజలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. రాజకీయ ప్రత్యర్థులు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని... అయితే రాజకీయంగా అది సాధ్యం కాకపోవడంతో క్షుద్రపూజలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆందోళన వ్యక్తం చేసారు.
కేరళలలోని రాజరాజేశ్వరి ఆలయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యలో పాటు తనపైనా తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయని శివకుమార్ అన్నారు. అఘోరాలు, తాంత్రికులను తమ ప్రత్యర్థులు రంగంలోకి దింపారని... రాజ కంటక, శత్రు భైరవి వంటి యాగాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికే ఈ పూజలు చేపట్టారని శివకుమార్ ఆరోపించారు.
ఈ తాంత్రిక పూజల గురించి తనవద్ద పూర్తి సమాచారం వుందని డికె. శివకుమార్ అన్నారు. ఈ పూజల్లో జంతు బలి కూడా జరిగిందని అన్నారు. 21 ఎర్రమేకలు, మరో 21 నల్ల గొర్రెలు, 3 గేదెలు , ఐదు పందులను బలి ఇచ్చారని తెలిపారు. ఇలా తాంత్రిక పూజలతో ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు.
ఈ క్షుద్ర పూజలు కర్ణాటకకు చెందిన రాజకీయ ప్రత్యర్థుల పనేనని శివకుమార్ అన్నారు. చేయిస్తున్నవారు ఎవరో కూడా తనకు తెలుసు... కానీ వారి పేర్లు బయటపెట్టనని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరు... పూర్తి పదవికాలం కొనసాగిస్తామన్నారు. తమకు హాని చేయాలని వాళ్ల క్షుద్ర శక్తులను కోరితే... మంచి చేయాలని తాను ఆ దేవుడిని కోరతానన్నారు. కాబట్టి ఆ దేవుడే తమను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడతారని డిప్యూటీ సీఎం డికె. శివకుమార్ పేర్కొన్నారు.