వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువన్నారు ప్రధాని నరేంద్రమోడీ. మంగళవారం జాతీయ యువ పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ యువత రాజకీయాల్లోకి రానంతకాలం కుటుంబం రాజకీయాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.

వారసత్వ రాజకీయాలను పూర్తిగా పెకిలించాల్సిన అవసరం ఎంతైనా వుందని మోడీ చెప్పారు. అయితే ఇంటి పేర్లతో ఎన్నికల్లో గెలుస్తోన్న వారి భవిష్యత్ మాత్రం క్రమంగా తగ్గుతోందని ప్రధాని తెలిపారు.

కేవలం వారి కుటుంబాలను రక్షించుకోవడానికే ఇలాంటి వారు రాజకీయాల్లో ఉంటారని మోడీ ఎద్దేవా చేశారు. వారసత్వ రాజకీయాలు దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ప్రధాని అభివర్ణించారు.

అందుకే యువత సైతం పార్లమెంట్‌లో అడుగుపెట్టాలని యువతకు మోడీ సూచించారు. కేవలం నిజాయితీతో రాజకీయాల్లోకి వచ్చే వారు మాత్రమే ప్రజల సంక్షేమం కోసం పాటు పడతారని., అలాంటివారే రాజకీయాల్లో కొనసాగుతారని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు.

జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి యువత పాఠాలు నేర్చుకోవాలని అదే సమయంలో శారీరక, మానసిక దృఢత్వం అవసరమన్న స్వామి వివేకానందుడి మాటలను ప్రధాని గుర్తుచేశారు. దేశ యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నామని మోడీ వెల్లడించారు.