భార్యభర్తల మధ్య గొడవ చివరికి ఆ భర్త బలవన్మరణానికి దారి తీసింది. ‘నీ జీవితం నువ్వు చూసుకో..’ అంటూ భార్యకు మెసేజ్ పెట్టి ఓ హోం గార్డ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కల్లకురిచి : తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. చిన్న సేలం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని ఆంథోని రాజ (33)గా గుర్తించారు. కల్లకురిచి జిల్లా త్యాగతురగం సమీపంలోని మెల్విలి గ్రామానికి చెందిన రాజా ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. చిన్న సేలం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పని చేస్తూ.. కల్లకురిచి పోలీస్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నాడు. ఆయనకు వివాహమై భార్యా, పిల్లలు ఉన్నారు. భార్య శీలపౌరిమేరి, ఆరేళ్ల కూతురు, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య శనివారం ఏదో విషయంగా గొడవ జరిగింది. దీంతో అలిగిన శీలపౌరిమేరి బయటకు వెళ్లిపోయింది. గొడవ జరిగిన తర్వాత ఆంథోనీ రాజ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగివచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో భార్య లేదు. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నాడు. 

దేశ ప్రయోజనాల కోసం అగ్నిపథ్.. జోక్యం చేసుకోలేం: పిటిషన్లు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

నీ జీవితం నువ్వు చూసుకో అని తన భార్యకు మెసేజ్ పెట్టాడు. నా జీవితం ముగించుకుంటున్నాను అని కూడా తెలిపాడు. ఈ మెసేజ్ చూసిన శీలపౌరిమేరి కంగారుగా ఇంటికి వచ్చి చూసేసరికి తలుపు లోపలి వైపు గడియ పెట్టి ఉంది. దీంతో మరింత కంగారుపడి.. ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆందోని రాజా ఉరేసుకుని మృతిచెంది కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.