తమిళనాడులో కలకలం రేపిన కస్టోడిల్ డెత్ కేసు.. ఇప్పుడు మర్డర్ కేసుగా మారింది. ఈ కేసులో పోలీసులే నిందితులయ్యారు. ఇప్పటికే ఓ ఎస్ఐ, కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు. ఈ కేసులో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డును సస్పెండ్ చేశారు. కాగా, పలువురు పోలీసులను దర్యాప్తు చేయడానికి సమన్లు పంపారు.  ఎంత మంది పోలీసులను అరెస్టు చేయబోతున్నామనే విషయాన్ని ఈ రోజు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

చెన్నై: కస్టోడియల్ మరణాలు కలవరం రేపుతున్నాయి. పోలీసుల ఇంటరాగేషన్ శృతిమించడం లేదా ఇతర కారణాలతో కొందరు కస్టడీలోనే మరణించిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే చెన్నైలో ఓ 25 ఏళ్ల యువకుడు కస్టడీలో మరణించిన సంగతి తెలిసిందే. తొలుత ఈ మరణాన్ని అనుమానాస్పద మృతిగా పేర్కొన్నారు. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో యువకుడి మృతదేహంపై బలమైన గాయాలు ఉండటంతో ఆ కేసును మర్డర్ కేసుగా మార్చారు. పోలీసులే నిందితులు అయ్యారు. త్వరలోనే ఈ మర్డర్ కేసులు పలువురు పోలీసులు అరెస్టు కాబోతున్నారని సీఎం స్టాలిన్ స్వయంగా వెల్లడించారు.

25 ఏళ్ల విజ్ఞేశ్ అనే యువకుడని గంజాయి తీసుకెళ్లుతున్నాడని, పోలీసులపైనే దాడి చేశాడన్న ఆరోపణలతో పోలీసులను గత నెల అరెస్టు చేశారు. అనంతరం, ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, కస్టడీలో విజ్ఞేశ్‌కు తరుచూ మూర్ఛ వచ్చిందని, వెంటనే తాము హాస్పిటల్‌కు తీసుకెళ్లామని, ఫలితం లేకపోయిందని తెలిపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రాజకీయంగానూ ప్రకంపనలు వచ్చాయి.

విజ్ఞేష్ పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం, ఆయన మృతదేహంపై తల, గదవపై సహా 13 గాయాలు అయ్యాయి. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అనుమానాస్పద మృతి కేసును మర్డర్ కేసుగా మార్చారు. ఈ కేసులో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డును సస్పెండ్ చేశారు. కాగా, పలువురు పోలీసులను దర్యాప్తు చేయడానికి సమన్లు పంపారు. అంతేకాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా ప్రయోగించబోతున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఎంత మంది పోలీసులను అరెస్టు చేయబోతున్నామనే విషయాన్ని ఈ రోజు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం విజ్ఞేశ్ మృతదేహంపై 13 గాయాలు కనిపించాయని అసెంబ్లీలో ప్రతిపక్షాలు తెలిపాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. వీరికి సమాధానంగా సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ, ఈ కేసును మర్డర్ కేసుగా మార్చామని వివరించారు. సీబీ-సీఐడీ ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.

మృతదేహంపై గాయాలు కనిపించాయి. కానీ, ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో పోలీసులు ఓ యువకుడిని చేజ్ చేసిన దృశ్యాలు కనిపించాయి. బ్యాటన్‌తో ఆయనపై విరుచుకుపడ్డట్టు వీడియో చూపిస్తున్నది. కాగా, హక్కుల కార్యకర్తలు, ప్రత్యక్ష సాక్షులు మాత్రం.. విజ్ఞేశ్‌ను పోలీసులు టార్చర్ చేశారని ఆరోపిస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఆయనపై దాడి చేశారని పేర్కొన్నారు.